More

    ఈడీ కస్టడీ లోకి దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్

    దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసులో ముంబైలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. దావూద్ ఇబ్రహీంపై మనీలాండరింగ్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముంబై సమీప ప్రాంతాల్లో సోదాలు జరిపారు. దావూద్ ఇబ్రహీం సోదరి దివంగత హసీనా పార్కర్ నివాసంలోనూ, మరికొందరు బంధువుల ఇళ్లల్లోనూ ఈడీ అధికారులు సోదాలు జరిపారు.

    దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను మనీలాండరింగ్ కేసులో శుక్రవారం 24 ఫిబ్రవరి 2022 వరకు ఈడీ కస్టడీకి పంపారు. దోపిడీ కేసులో కస్కర్‌ను థానే జైలులో ఉంచారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. ముంబయి అండర్‌వరల్డ్‌తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.

    ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో ప్రమేయం ఉన్నందుకు దావూద్ ఇబ్రహీం, అతని సహాయకులపై ED ఇటీవల మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్, అతని సహాయకులు, ముఠా సభ్యులను ఈడీ ఇప్పుడు విచారించనుంది. ఇక్బాల్ కస్కర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని ED చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు ఆమోదించింది.

    ఫిబ్రవరి 16న, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కస్కర్‌పై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఈడీ తరపు న్యాయవాది హిటెన్ వెనెగావ్కర్ కోర్టును అభ్యర్థించడంతో కస్కర్‌ను తమ ముందు హాజరుపరచాలని తలోజా సెంట్రల్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈడీ అతన్ని మనీలాండరింగ్ నిరోధక చట్టం న్యాయమూర్తి MG దేశ్‌పాండే ముందు హాజరుపరిచింది.

    దావూద్ ఇబ్రహీం సోదరుడైనందుకే ఇక్బాల్ కస్కర్ వేధింపులకు గురవుతున్నాడని ఇక్బాల్ కస్కర్ తరపు న్యాయవాది సుల్తాన్ ఖాన్ కోర్టులో వాదించారు. దావూద్ దేశం విడిచి వెళ్లిన తర్వాత దావూద్ ఇబ్రహీంతో ఇక్బాల్‌కు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈడీ దర్యాప్తు చేయాల్సిన అంశంతో ఇక్బాల్ కస్కర్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ఇక్బాల్ కస్కర్ చాలా నెలలుగా జైలులో ఉన్నాడని అన్నారు.

    ఇక్బాల్ కస్కర్ తన సోదరుడి కోసం పనిచేస్తున్నాడని.. ముంబై, ఇతర ప్రాంతాలలో అతని ముఠా కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తున్నాడని అధికారులు ఆరోపించారు. ఇటీవలి కాలంలో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న వార్తలు వస్తున్నాయి.

    Trending Stories

    Related Stories