పాకిస్థాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సోహైల్ కస్కర్

0
742

భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సోహైల్ కస్కర్ పాకిస్థాన్‌కు పారిపోయాడు. నార్కో-టెర్రరిజం ఆరోపణలపై అమెరికాలో జైలు శిక్ష అనుభవించిన సోహైల్‌ను కనిపెట్టేందుకు ముంబై పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవలి సమాచారం ప్రకారం, కస్కర్ దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పారిపోయాడు. సొసోహైల్ కస్కర్ భారత నిఘా వర్గాల కన్నుగప్పి, పాకిస్థాన్ చేరుకున్నాడు. కస్కర్‌ను భారత దేశానికి రప్పించేందుకు చాలా కాలం నుంచి నిఘా వర్గాలు కృషి చేస్తున్నాయి. ఇతను దుబాయ్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నట్లు ముంబై పోలీసు వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి.

భారతీయ నిఘా వర్గాలు ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ను విన్నపుడు అది కస్కర్ చేసినదేనని వెల్లడైంది. అనంతరం నిర్వహించిన దర్యాప్తులో అతను దుబాయ్ గుండా పాకిస్థాన్ చేరుకున్నట్లు తెలిసింది. అతను చాలా కాలం క్రితమే అమెరికా నుంచి బయటకు వచ్చేసినట్లు తేలింది. అమెరికా ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపిన అనంతరం అతడు దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పారిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ కేసులో ముంబై పోలీసులు, అమెరికాలోని దర్యాప్తు విభాగాల సహకారంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కస్కర్ దావూద్ ఇబ్రహీం సోదరుడి కుమారుడు. కస్కర్ మరియు అతని సహచరుడు డానిష్ అలీని ఆయుధాల స్మగ్లింగ్ మరియు మాదక ద్రవ్యాల వ్యాపారం ఆరోపణలపై స్పెయిన్ నుండి అమెరికా, స్పానిష్ ప్రభుత్వ ఏజెంట్లు అరెస్టు చేశారు. భారత పోలీసులు డానిష్ అలీని USA నుండి రప్పించగలిగినప్పటికీ, కస్కర్ అప్పగింత కోసం వేచి ఉన్నారు.

2001లో దుబాయ్‌లో డానిష్ అలీ, కస్కర్ కలుసుకున్నారు. వీరిద్దరూ మూడేళ్ళపాటు కలిసి ఉన్నారు. డానిష్‌ను వజ్రాల అక్రమ రవాణాలోకి కస్కర్ దించినట్లు, అనంతరం అతనిని రష్యాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డానిష్ 2003లో స్టూడెంట్ వీసాపై రష్యా వెళ్ళాడు. అదే సమయంలో సోహైల్ కస్కర్ దక్షిణాఫ్రికాలో వజ్రాల అక్రమ రవాణా కేసులో అరెస్టయి, ఓ ఏడాదిపాటు జైలు జీవితం గడిపాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఆయుధాల అక్రమ రవాణా ప్రారంభించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసులో వీరిద్దరినీ అమెరికన్ దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. సోహైల్ దోషి అని అమెరికన్ కోర్టు 2018 సెప్టెంబరు 12న తీర్పు చెప్పింది. అతనిని భారత దేశానికి రప్పించడానికి ఇండియన్ ఏజెన్సీస్ తీవ్రంగా ప్రయత్నించాయి.

కస్కర్ ఎలా.. ఏ పరిస్థితుల్లో అమెరికా నుంచి పాకిస్థాన్‌కు పారిపోయాడో ఇంకా అర్థం కాలేదు. అతడు పాకిస్థాన్ కు వెళ్లిపోవడంలో సీబీఐ అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. సెప్టెంబరు 2015లో USలో అతడిని నిర్బంధించినప్పటి నుండి, కస్కర్‌ను భారతదేశానికి తీసుకురావడానికి భారత అధికారులు వివిధ దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇండియా-అమెరికా పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (2005) ప్రకారం సోహైల్ కస్కర్‌ను భారత్‌కు అప్పగించేందుకు ముంబై పోలీసులు, భారతీయ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోహైల్ కస్కర్ 2014లో స్పెయిన్‌లో పట్టుబడ్డాడు మరియు నార్కో-టెర్రరిజం ఆరోపణలపై మరియు కొలంబియా తిరుగుబాటుదారులకు ఆయుధాలను విక్రయించినందుకు యునైటెడ్ స్టేట్స్‌కు తీసుకువచ్చారు. 1993లో ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత సోహైల్ తన 10 ఏళ్ల వయసులో తన తండ్రి నూరా కస్కర్, మామ దావూద్ ఇబ్రహీంతో కలిసి భారతదేశాన్ని విడిచిపెట్టాడు.