పాకిస్తాన్ నటి, అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం ప్రేయసిగా చెప్పుకోబడుతున్న మెహ్విష్ హయత్ ఇటీవల తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టింది. పాకిస్తాన్ ప్రధాని కుర్చీలో కూర్చోవాలని అనుకుంటున్నానని ఆమె తన లక్ష్యాన్ని బయటపెట్టింది. జియో టివిలో ఆమెను పలు ప్రశ్నలు అడిగారు.. అప్పుడు హయత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి తాను ప్రేరణ పొందానని, ఏదో ఒక రోజు దేశ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. ఆమె రాజకీయాలలో కొనసాగాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు.. ఆమె నమ్మకంగా స్పందిస్తూ “ఇన్షాఅల్లా” అంటూ సమాధానం చెప్పింది.

“మీరు పార్లమెంట్ ద్వారా లేదా రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వస్తారా” అని అడిగితే.. పార్లమెంటులో చేరడం ద్వారా లేదా సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి రావడమన్నది కాలమే నిర్ణయిస్తుంది అని మెహ్విష్ హయత్ సమాధానం చెప్పింది. ముఖ్యంగా పిటిఐ రాజకీయాల నుండి తాను ప్రేరణ పొందానని హయత్ అన్నారు. “నేను వారి రాజకీయాల నుండి ప్రేరణ పొందాను. ఎందుకంటే వారు మంచి మార్పులు తీసుకుని వచ్చారు. పాకిస్తాన్ సమాజం ఆలోచించే విధానంలో ఒక మార్పును తీసుకువచ్చారు. ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లోకి రాకముందే క్రికెటర్. ఒక క్రికెటర్ దేశ ప్రధానమంత్రి కాగలిగితే, ఖచ్చితంగా నటులు కూడా ప్రధాని కావచ్చు ”అని ఆమె తెలిపింది.

దేశ ప్రధాని కావాలన్న ఆమె ఆసక్తిని చూసిన యాంకర్.. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సవాలు చేయాలనుకుంటున్నారా అని అడిగితే.. పాకిస్తాన్ తరువాతి మహిళా ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నానని హయత్ ధైర్యంగా చెప్పుకొచ్చింది. “నేను ఇమ్రాన్ ఖాన్ ను సవాలు చేయాలనుకోవడం లేదు, కానీ రాబోయే కాలంలో అతని స్థానాన్ని ఎవరైనా పొందవలసి ఉంటుంది. అప్పుడు నేను కూడా ప్రధానమంత్రి పదవికి పోటీలో ఉండగలను” అని ఆమె చెప్పారు.

హయత్ తో దావూద్ అఫైర్:
దావూద్ ఇబ్రహీంకు హయత్ తో సంబంధం ఉందని.. పాకిస్తాన్ నటితో దావూద్ ఇబ్రహీం రొమాన్స్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చిన తరువాత గ్యాంగ్ స్టర్ దావూద్ అసంతృప్తికి గురయ్యాడని ఇటీవల వార్తలు వచ్చాయి. మెహ్వీష్ హయత్ దావూద్ ఇబ్రహీం కంటే 27 సంవత్సరాలు చిన్నది. 2019 లో పాకిస్తాన్ యొక్క పౌర గౌరవం తమ్ఘా-ఎ-ఇంతియాజ్ ఆమెకు లభించిన తరువాత దావూద్ తో సంబంధం గురించి పుకార్లు షికార్లు చేశాయి.
దావూద్ ఇబ్రహీం మెహ్వీష్ హయత్ ను ఐటమ్ సాంగ్ లో చూసిన తర్వాత ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడని తెలుస్తోంది. ఆ ఐటమ్ సాంగ్ షూటింగ్ తర్వాత దావూద్ ఆమెతో సంబంధం పెట్టుకున్నాడని.. ఆమె చేతుల్లోకి పెద్ద ప్రాజెక్టులు వచ్చేలా ఆమెకు సహాయం చేసాడు. పాకిస్తాన్ చిత్ర పరిశ్రమలో హయత్ చాలా తక్కువ సమయంలో స్టార్ గా ఎదగడం వెనుక తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్న కరాచీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ఉన్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. తరువాత ఆ వ్యక్తి మరెవరో కాదని దావూద్ ఇబ్రహీం అని తేలింది. దావూద్ పాక్ సినీ పరిశ్రమపై ఎప్పుడూ గట్టి పట్టు కలిగి ఉన్నాడని.. పాకిస్తాన్లోని చాలా మంది దర్శకుడు-నిర్మాతలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే..!
