National

RSS నూతన ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హోసబలే

చాలా మందికి ఆర్ఎస్ఎస్ లో ఎన్నికలు కూడా జరుగుతాయా? అని ఓ డౌంట్.! అవును… సంఘ్ లో ఎన్నికలు జరుగుతాయి.! ప్రతి మూడేళ్ళకు ఒకసారి జిల్లా, ప్రాంతం, క్షేత్ర స్థాయి నుంచి మొదలు పెడితే అఖిల భారత స్థాయి వరకు ఎన్నికలు జరుగుతాయి. దేశలోని అన్ని ప్రాంతాల నుంచి ఎన్నికైన ప్రతినిధులు మూడేళ్ల కాలపరిమితికి అఖిల భారత స్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు.ఈ నూతన కార్యవర్గమే రాబోయే మూడేళ్ల పాటు సంఘ్ నిర్వహించేబోయే కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది.

ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభా సమావేశాలు బెంగళూరులోని చెన్నేహళ్ళిలోని జనాసేవా విద్యాకేంద్రంలో మార్చి 19, 20వ తేదీల్లో జరిగాయి. ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ నూతన సర్ కార్యవహగా మాననీయ దత్తాత్రేయ హోసబలేజీ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిని సంఘ్ పరిభాషలో సర్ కార్యవహగా వ్యవహారిస్తారు. అలాగే సంఘ్ లో అత్యున్న బాధ్యతల్లో సర్ సంఘచాలక్ ఉంటారు. సర్ సంఘచాలక్ అనగా ఆర్ఎస్ఎస్ చీఫ్ అని అర్థం. ప్రస్తుత ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తర్వాత రెండోస్థానంలో సర్ కార్యవహనే ఉంటారు.

2009 నుంచి కూడా  సర్ కార్యవహ బాధ్యతల్లో భయ్యాజీ జోషి ఉన్నారు. వయోభారం కారణంగా మూడేళ్ల క్రితమే తన స్థానంలో మరోకరిని ఎన్నుకోవాలని భయ్యాజీ కోరుకున్నారు. అయితే సంఘ్ పెద్దల కోరిక మేరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభా సమావేశాల్లో నిర్వహించిన ఎన్నికల్లో దత్తాత్రేయ హోసబలేజీని… సంఘ్ ప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దత్తాత్రేయ హోసబలే కర్ణాటకలోని శివమొగ్గలోని హోసబలే గ్రామంలో 1955లో జన్మించారు. 1968లో ఆర్ఎస్ఎస్ లో  పూర్తి సమయకార్యకర్తగా చేరారు. ఆ తర్వాత సంఘ్ ఆదేశాల మేరకు 1972లో మహారాష్ట్రలో ఏవీబీపీ విస్తరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ముంబై కేంద్రంగా ఏబీవీపీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 15 ఏళ్ళపాటు విద్యార్థి పరిషత్ కు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయంలో తిరిగి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం లోక్ సంఘర్షణ సమితిలో చేరి అజ్ఞతంలో ఉంటూ ఉద్యమం నడిపారు. ఆతర్వాత  మీసా యాక్ట్ కింద అరెస్టు అయ్యారు. ఏడాది కాలం పాటు జైలు జీవితం కూడా గడిపారు.

కన్నడ,హిందీ,ఇంగ్లీష్,తమిళం, సంస్కృతంలో అనర్ఘలముగా మాట్లాడే వీరు కొంతకాలం అసీమ అనే కన్నడ మాసపత్రికకు ఎడిటర్ గా కూడా పనిచేశారు. దాంతోపాటు ఆర్ఎస్ఎస్ ఇంటలెక్చువల్ వింగ్ లో కీలకంగా వ్యవహారించారు. 2004లో ఆర్ఎస్ఎస్ అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్ గా. ఆ తర్వాత సహ కార్యవహగా బాధ్యతలు నిర్వహించారు. అమెరికాతోపాటు, బ్రిటన్ లోని హిందూ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలను సైతం దత్రాత్రేయ హోసబలే పర్యవేక్షించారు.

నూతన సర్ కార్యవహగా ఎన్నికైన దత్తాత్రేయ హోసబలే విద్యార్థి ఉద్యమ నెపథ్యం నుంచి వచ్చారు.  అలాగే ప్రస్తుతం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు హిందుత్వ అజెండగా ముందుకు సాగుతున్న ఈ వేళా.. హోసబలే సంఘ్ జనరల్ సెక్రటరీగా ఎన్నిక కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఎందుకంటే… 2024లో కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పాలనా పరంగా మోదీ ప్రభుత్వం అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.  ఈ సంస్కరణల ఫలాలు మరింత పకడ్బందిగా దేశ ప్రజలకు అందాలంటే మోదీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని సంఘ్ కోరుకుటున్నట్లు తెలుస్తోంది. దాంతోపాటు 2025 విజయదశమినాటికి దేశంలో ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగి వందేళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భంగా దేశంలోని ఆరు లక్షల  గ్రామాలకు సంఘ్ కార్యాన్ని తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సంఘ్ నూతన కార్యవర్గం తీసుకునే నిర్ణయాలపై పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

11 + twenty =

Back to top button