More

  దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి చొరబడ్డ దుండగులు.. స్వామి నరేశానంద్ సరస్వతిపై దాడి

  మంగళవారం (ఆగస్టు 10) ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని దాస్నా దేవి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు పూజారి స్వామి నరేశానంద్ సరస్వతిని చంపడానికి ప్రయత్నించారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఆలయం గోడను దాటుకుని ప్రాంగణంలోకి ప్రవేశించారు. స్వామి నరేశానంద్ సరస్వతి ఆ సమయంలో నిద్రపోతుండగా.. నిందితులు ఆయన కడుపు, మెడ ప్రాంతంలో పదునైన ఆయుధంతో పొడిచారు. ఇది తీవ్రమైన రక్తస్రావానికి దారితీసింది. ఆలయ సిబ్బంది ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

  బీహార్‌లోని సమస్తిపూర్ నుండి ఆగస్టు 7న స్వామి నరేశానంద్ సరస్వతి దాస్నకు వచ్చారు. హిందూ పూజారి, మహంత్ యతి నరసింహానంద్ సరస్వతి దాస్నా దేవి ఆలయంలో ఉన్నారు. స్వామి నరేశానంద్ సరస్వతి గది ప్రక్కనే ఉన్న మరో గదిలో మహంత్ యతి నరసింహానంద్ సరస్వతి నిద్రిస్తున్నారు. మహంత్ యతి నరసింహానంద్ సరస్వతి సరస్వతి కొంతమంది హిట్ లిస్టులో ఉన్నారు. మహంత్ యతి నరసింహానంద్ సరస్వతికి గతంలో అనేక బెదిరింపులు వచ్చాయి. ఆయనకు, దేవాలయ భద్రతకు పోలీసులను నియమించారు. ఆలయ సాయుధ కాన్స్టాబ్యులరీ (పిఎసి) బృందం ఆలయం వెలుపల ఉన్నప్పటికీ, సంఘటన జరిగిన 20 నిమిషాల తర్వాత వాళ్లు స్పందించారు.

  మహంత్ యతి నరసింహానంద్ సరస్వతి అనుచరుడు అనిల్ యాదవ్ మాట్లాడుతూ స్వామి నరేశానంద్ సరస్వతిపై జరిగిన దాడి దేవాలయ భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్న పిఎసి గార్డుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని అన్నారు. దాడి గురించి మసూరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయబడింది. ఎస్‌పి (దేహాత్) ఇరాజ్ రాజా ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు ఇప్పుడు విశ్లేషిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. కెమెరాలు స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు.

  పోలీసులు మాట్లాడుతూ బాధితుడు తన గదిలో కాకుండా బయట నిద్రపోతున్నాడని అందుకే ఆయనపై ఘోరమైన దాడి జరిగిందని అన్నారు. ఈ దారుణాలకు పాల్పడిన వారు బయటి వ్యక్తులా లేక దగ్గరి వారేనా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని నిందితులను త్వరగా పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

  జంతర్ మంతర్ నిరసన కార్యక్రమానికి హాజరైన స్వామి నరేశానంద్ సరస్వతి

  తాజా నివేదికల ప్రకారం దాస్నా ఆలయ పూజారి స్వామి నరేశానంద్ సరస్వతి జంతర్ మంతర్ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్టు 8 న నిర్వహించిన ఆ కార్యక్రమంలో ఒక సమూహానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచిన్ గుప్తా, కరస్పాండెంట్, హిందీ డైలీ దైనిక్ భాస్కర్ ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు “ఘజియాబాద్ దేవాలయంలో పూజారిపై దాడికి పెద్ద అప్‌డేట్.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అశ్విని నాయకత్వంలో నిరసనలో పాల్గొనడానికి స్వామి నరేశానంద్ సరస్వతి బీహార్ నుండి వచ్చారు. నిరసనలో ఒక నిర్దిష్ట సమాజానికి వ్యతిరేకంగా వివాదాస్పద నినాదాలు చేశారు. నిరసన జరిగిన కొన్ని గంటల తర్వాత అతనిపై దాడి జరిగింది.” అని ట్వీట్ లో ఉంది.

  స్వామి నరేశానంద్ నిరసనకు హాజరుకావడానికి, స్వామి యతి నర్సింహానంద్ సరస్వతిని కలవడానికి వచ్చిన మాట వాస్తవమని ధృవీకరించారు. కానీ యతి నర్సింహానంద్ సరస్వతి నిరసనకు హాజరు కాలేదు. దాస్నా పూజారిపై దాడికి సంబంధించిన కారణాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు.

  యతి నర్సింహానంద్ సరస్వతి హత్యకు కుట్ర:

  మే నెలలో, ఢిల్లీ పోలీసులు పహర్‌గంజ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేయడంతో దాస్నా దేవి ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింహానంద్ సరస్వతిపై హత్య చేయడానికి ప్రయత్నించారనే విషయం బయటకు వచ్చింది. ఉగ్రవాది నుండి ఒక .30 బోర్ పిస్టల్‌తో పాటు రెండు మ్యాగజైన్లు, 15 లైవ్ రౌండ్‌లతో పాటు, కుర్తా, మాల, చందన్ టీకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పుల్వామాకు చెందిన మొహమ్మద్‌ దార్ అలియాస్ జహంగీర్ గా గుర్తించారు. దాస్నా దేవి ఆలయ ప్రధాన పూజారిని చంపడానికి రూ .41,000 చెల్లించినట్లు తెలుస్తోంది. దాడికి ప్లాన్ చేసిన దాదాపు 10 రోజుల క్రితం అతడిని పహార్‌గంజ్‌లోని హోటల్ శివ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ అరెస్ట్ రహస్యంగా ఉంచబడింది. విచారణలో పాకిస్థాన్‌కు చెందిన అబిద్ అనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కు చెందిన వ్యక్తి ఈ పని చేయడానికి తనను నియమించినట్లు దార్ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది. దార్ తన స్వగ్రామానికి సమీపంలో వడ్రంగిగా పనిచేశానని, అక్కడ డిసెంబర్ 2020 లో అబిద్‌ను కలిశానని చెప్పాడు. అబిద్ జైషే మహ్మద్ నుండి వచ్చానని అతడికి చెప్పాడు. వారిద్దరూ ఏప్రిల్ 2021 లో మళ్లీ కలుసుకున్నారు. వాట్సాప్‌లో వారు ఒకరితో ఒకరు నిరంతరం చాట్ చేసుకుంటూనే ఉన్నారు. ఫిబ్రవరిలో, గుండె జబ్బుతో బాధపడుతున్న మేనల్లుడి చికిత్స కోసం దార్ తన సోదరి, ఆమె మామగారితో కలిసి ఢిల్లీకి వచ్చారు. వారు కాశ్మీర్‌కు తిరిగి వెళ్లిన తర్వాత, దాస్నా దేవి దేవాలయ ప్రధాన పూజారి యతి నర్సింహానంద్ సరస్వతిని హత్య చేసే బాధ్యతను అబిద్ మొహమ్మద్ దార్ కి అప్పగించాడని పోలీసులు తెలుసుకున్నారు.

  Related Stories