దళిత బంధు నిలిపివేత.. కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్

0
671

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం అమలును నిలిపివేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు దళిత బంధు అమలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది. ఎన్నికల వేళ హుజూరాబాద్ ఓటర్లను దళిత బంధు పథకం ప్రభావితం చేసేలా ఉందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావించింది. ఇప్పటికే కొందరు లబ్దిదారులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్ నియోజవర్గం చుట్టూ ఎన్నో రాజకీయాలు ఇటీవల చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! ఆ సమయంలోనే దళితబంధును తీసుకుని రావడంపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి.

దళిత బంధు పథకాన్ని ఎన్నికల కమిషన్ ఆపివేయడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థతేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడూ నిలిపేయదని, కేసీఆర్ దళిత బంధును పూర్తిస్థాయిలో ప్రారంభించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. దళితుల్ని మోసం చేసిన కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చే కుట్ర జరుగుతోందని.. కేసీఆర్ కుట్ర బుద్ధితోనే ఇప్పటివరకు దళితబంధు నిధులు విడుదల కాకుండా ఆపారన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ డబ్బును బ్యాంకులు ఫ్రీజ్‌ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని విమర్శించారు. దళిత బంధు లబ్ధిదారులు ఆ డబ్బుల్ని డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారికి తాము వినతిపత్రం ఇచ్చినట్లు బండి సంజయ్ తెలిపారు.