More

    సెక్యూరిటీ గార్డు నుండి ప్రపంచం మెచ్చే రెజ్లర్ దాకా.. ఇప్పుడు బీజేపీలో

    దలీప్ సింగ్ రానా.. ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు.. అయితే ‘ది గ్రేట్ ఖలీ’ అంటే చాలు.. ఓ భారీ శరీరం మీ కళ్లకు కనిపిస్తుంది. తాజాగా గ్రేట్ ఖలీ భారతీయ జనతా పార్టీలో చేరారు. డబ్ల్యూడబ్ల్యూఈ ద్వారా వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దలీప్ సింగ్ రానా అధికార పార్టీలో చేరారు. పార్టీని బలోపేతం చేయడానికి, దలీప్ సింగ్ రాణా అకా ది గ్రేట్ ఖలీని భారతీయ జనతా పార్టీ చేర్చుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంలో గురువారం నాడు అధికారికంగా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్లమెంట్ సభ్యురాలు సునీతా దుగ్గల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు.

    డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్‌కు స్వాగతం పలుకుతూ జితేంద్ర సింగ్ తన దృఢమైన శరీరాకృతి, ఆలోచనల మాదిరిగానే పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తారని చెప్పారు. జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ “బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ, ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ మల్లయోధులను ఓడించిన గ్రేట్ ఖలీ పార్టీలో చేరారు. పంజాబ్ పోలీస్‌లో అధికారిగా కూడా పనిచేసిన ఒక రైతు కుమారుడు, ఖలీ దేశం గర్వించేలా చేసాడు. ఆయన బీజేపీలో చేరడం నాకు సంతోషంగా ఉంది” అని అన్నారు.

    గ్రేట్ ఖలీ మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల ద్వారా నేను ఎంతగానో స్ఫూర్తి పొందాను. దేశం కోసం బీజేపీ అనుసరిస్తున్న విధానం నుండి నేను ప్రేరణ పొందడమే కాకుండా ఎంతో ప్రభావితమయ్యాను. బీజేపీ విధానం దేశ ప్రగతి లక్ష్యంగా ఉంది. దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. దేశాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న ప్రయాణంలో ఎందుకు భాగం కాకూడదని నేను అనుకున్నాను. నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తాను’’ అని అన్నారు.

    సెక్యూరిటీ గార్డ్ నుండి రెజ్లర్ దాకా:
    ఖలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో పంజాబీ మాట్లాడే హిందూ-రాజ్‌పుత్ కుటుంబంలో దలీప్ సింగ్ రాణాగా జన్మించాడు. అక్రోమెగలీతో జన్మించిన ఖలీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. 1993లో సిమ్లాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అక్కడ ఒక పోలీసు అధికారి ఖలీని గమనించాడు. తరువాత పంజాబ్ పోలీసులో స్థానం సంపాదించాడు. స్థానిక జిమ్‌లలో శిక్షణ పొందడం ప్రారంభించాడు, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో శిక్షణ కోసం ఎంపికయ్యాడు.

    2001 నాటికి, ఖలీ యునైటెడ్ స్టేట్స్‌లోని ఆల్ ప్రో రెజ్లింగ్ లో ప్రొఫెషనల్ రెజ్లర్. 2006లో, అతను ‘ది గ్రేట్ ఖలీ’ అనే రింగ్ పేరుతో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో చేరాడు. దీనితో, అతను WWEతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్ అయ్యాడు. ఎన్నో టైటిళ్లు గెలుచుకున్నాడు. అతని ఒప్పందం 2014లో ముగిసింది, ఆ తర్వాత అతను కంపెనీని విడిచిపెట్టాడు. ఖలీని wwe- 2021లో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. ఖలీ అనేక చిత్రాలలో నటించాడు. బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పాల్గొన్నాడు. ఖలీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అనేక శిక్షణా కేంద్రాలను ప్రారంభించాడు. పిల్లలకు రెజ్లింగ్ లో శిక్షణ ఇస్తున్నాడు.

    Trending Stories

    Related Stories