సైక్లోన్ యాస్ లైఫ్ అప్డేట్స్

భారత వాతావరణ శాఖ విభాగం ఉత్తర ఒరిస్సా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. పశ్చిమ బెంగాల్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఝార్ఖండ్ లోనూ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. నేడు అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఐఎండీ డీజీ మృత్యుంజయ మోహపాత్ర మాట్లాడుతూ.. యాస్ సైక్లోన్ ఒరిస్సా తీరాన్ని దాటుతోందని తెలిపారు. రేపటి ఉదయం కల్లా ఝార్ఖండ్ కు తాకుంది. గత 24 గంటలుగా ఒరిస్సాలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఈరోజు కూడా ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని తెలిపారు.
యాస్ సైక్లోన్ లో సహాయ చర్యల కోసం ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. బెంగాల్ రాష్ట్రంలో ఆర్మీ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వంతో ఆర్మీ అధికారులు మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం ఆర్మీ సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. తుపాను కారణంగా చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు వేరే ప్రాంతాలకు తరలించారు.
ఒడిశాలో తుపాను ప్రభావం అధికంగా చాందీపూర్, బాలాసోర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. పశ్చిమ బెంగాల్లోని దిగా తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. రోడ్డుపైకి సముద్రపు నీరు వచ్చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
యాస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందస్తు చర్యలపై కలెక్టర్లు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. యాస్ తుపానుకు సంబంధించి వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయన చెప్పారు. కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు.
భారత నేవీ కూడా అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది. ఐఎన్ఎస్ చిల్కా ఖుద్రా వద్ద ఉందని.. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల విషయంలో అలర్ట్ గా ఉన్నామని తెలిపింది. 24X7 సైక్లోన్ మానిటరింగ్ టీమ్ మే 24 నుండి పరిస్థితిని సమీక్షిస్తోంది.