తౌక్తా తుఫాను.. కేరళలో భారీ వర్షం కుప్పకూలిపోయిన భవంతులు

కేరళ రాష్ట్రాన్ని తౌక్తా తుఫాను వణికిస్తోంది. ఇవాళ తీవ్ర తుఫానుగా మారబోతోందని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. తౌక్తా తుఫాను దాటికి చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తూ ఉంది. శనివారం ఉదయం పెను గాలులు మొదలవ్వడమే కాకుండా భారీ వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలోకి వెళ్లాయి. శనివారం రాత్రి ఈ తుఫాను మరింత తీవ్రమవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని చెప్పారు. దీంతో గంటకు 150 నుంచి 175 కి.మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపారు. ప్రస్తుతం అమిని ద్వీపానికి ఈశాన్య దిశగా 160 కిలోమీటర్ల దూరంలో తౌక్తా తుఫాను ఉంది. అది మరింత బలపడి 12 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుంది. కేరళలో ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్టు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.
ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వేనాడ్, కన్నూరు, కసర్గోడ్ జిల్లాలు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లామ్, పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
చాలా జిల్లాల్లో ఎన్నో భవనాలు భారీ వర్షం, గాలుల దాటికి కూలిపోయాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఇప్పటి వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాలలో భవనాలు నేలమట్టమయ్యాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారిని దగ్గరలోని రిలీఫ్ క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. త్రివేండ్రంలో రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్ల మధ్యన చెట్లు కూలిపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పరిస్థితులను చెక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కళ్ళార్ కుట్టి, మలంకర, బూతతాన్కెట్టు డ్యామ్ ల నుండి నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు.