గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది.. ఎన్నో సాహసాలు చేసి సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఆ సమయంలో జ్యోతి అనే అమ్మాయి గురించి ప్రపంచం మొత్తం చెప్పుకుంది. ఆమె తండ్రిని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి చేసిన ప్రయత్నం అలాంటిది. తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని 1200 కిలోమీటర్లు తొక్కిందని చెప్పారు. ఆమె చేసిన సాహసానికి ‘సైకిల్ గర్ల్’ అనే పేరు దేశం మొత్తం మారుమ్రోగిపోయింది.

15 ఏళ్ల జ్యోతి తన తండ్రిని తీసుకుని సైకిల్ పై బీహార్ లోని తన సొంతూరికి వెళ్ళింది. ఆ అమ్మాయి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ను కూడా అందుకుంది. బీహార్ లోని దర్బంగ జిల్లా సిర్హులి గ్రామానికి చెందిన మోహన్ పాస్వాన్ గురుగ్రామ్ లో ఆటో నడిపేవాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. లాక్‌డౌన్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పెద్ద కూతురు జ్యోతి యాక్సిడెంట్ అయిన తండ్రి బాగోగులను చూసుకోడానికి గురుగ్రామ్ వెళ్లింది. అదే సమయంలో లాక్ డౌన్ కేంద్రం ప్రకటించడంతో తండ్రీ కూతురు గురుగ్రామ్ లో ఇరుక్కుపోయారు. మోహన్ ఇంటి అద్దె కూడా చెల్లించలేకపోవడంతో ఇంటిని ఖాళీ చేయాలని యజమాని కోరాడు. చేతిలో డబ్బులు లేవు.. ఉపాధి కూడా లేకపోవడంతో స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకొని జ్యోతి గురుగ్రామ్ నుండి 1200 కి.మీ దూరంలోని తమ స్వగ్రామానికి చేరుకోవడం ఆమె లోని తెగువను ప్రపంచానికి పరిచయం చేసింది. జ్యోతి సాహసం గురించి తెలుసుకుని భారత సైక్లింగ్ ఫెడరేషన్ ఆమెకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అలా ఆమెను ఇప్పటికీ అందరూ గుర్తు పెట్టుకున్నారు.

ఆరోజు తన తండ్రిని కాపాడుకున్న ఆమెకు ఇప్పుడు తీరని దుఃఖం మిగిలింది. ఆ అమ్మాయి ఇంట్లో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఆమె తండ్రి మోహన్ పాశ్వాన్ మరణించాడు. జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడని అధికారులు ధృవీకరించారు. తమ స్వస్థలం దర్భంగాలో ఆయన తుది శ్వాస విడిచాడని జిల్లా మెజిస్ట్రేట్ డా.ఎస్ఎం త్యాగరాజన్ ధ్రువీకరించారు. సంబంధిత అధికారులకు సమాచారమిచ్చి ఆ కుటుంబానికి అవసరమైన సాయం చేయాల్సిందిగా ఆదేశించినట్లు త్యాగరాజన్ తెలిపారు.
