12వేల కోట్లు కొట్టేసిన వ్యక్తికి ఉద్యోగ ఆఫర్..!

క్రిప్టో కరెన్సీ.. ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. మొదట్లోనే వీటిని కొనుక్కున్న వాళ్లు.. ఇప్పుడు ఏకంగా కోట్లకు పడగలు ఎత్తారు. మరో వైపు కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ విషయంలో నియమ నిబంధనలను అమలు చేస్తూ ఉన్నాయి. ఇక క్రిప్టో కరెన్సీని కొట్టేసే బ్యాచ్ లు కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అలా ఓ హ్యాకర్ తాజాగా చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హ్యాకర్ ఏకంగా 610 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని ఓ కంపెనీ దగ్గర కొట్టేశాడు. టోకెన్ స్వాపింగ్ ప్లాట్ ఫామ్ లో ఉన్న తప్పులను పట్టుకున్న ఆ హ్యాకర్ ఏకంగా 610 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని లాగేశాడు. భారత కరెన్సీలో ఇది దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు సమానం.
డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే పాలిగాన్ డిఫై యాప్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ యాప్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీని దోచుకున్నారు. పాలినెట్‌వర్క్ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 273 మిలియన్ టోకెన్లు, బినాన్స్ స్మార్ట్ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 85 మిలియన్ల యూఎస్ డాలర్ కాయిన్లు, 33 మిలియన్ల విలువైన స్టేబుల్ కాయిన్లను కొట్టేశారు. మొత్తంగా 611 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని హ్యాకర్ తస్కరించాడు.
హ్యాక్ చేసి కొల్లగొట్టిన ఆస్తులను వెంటనే తిరిగి ఇవ్వాలని పోలీ నెట్వర్క్ ట్విటర్లో పోస్ట్ చేసిన లేఖలో హ్యాకర్ ను కోరింది. ఈ డబ్బు కొన్ని వేల మంది క్రిప్టో కరెన్సీ సభ్యులది కావడంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని క్రాక్ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్ కొట్టేసిన దాంట్లో 260 మిలియన్ డాలర్లు వెనక్కు ఇచ్చాడు. ఇందులో ఈథేరియమ్ 3.3 మిలియన్ డాలర్లు, బినాన్స్ స్మార్ట్ కాయిన్లు, 256 మిలియన్లు, పాలిగాన్ 1 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని పాలినెట్‌వర్క్ డిఫై యాప్‌లో జమ చేశాడు.
ఈ హ్యాకర్ మంచి వ్యక్తి అని సదరు సంస్థ భావిస్తోంది. బాధితుల మేలు కోరి హ్యాక్ చేశారని అనుకుంటోంది. అందుకే హ్యాకర్ కు ఉద్యోగం ఆఫర్ ఇచ్చారు. మీరు హ్యాక్ చేయడం వల్ల మా డిఫై యాప్‌లోని లోపాలు తెలిశాయి. మీలాంటి నిపుణుల అవసరం మాకు ఉంది. కాబట్టి పాలినెట్వర్క్కి చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా సేవలు అందివ్వాలని అడిగింది. అంతేకాదు హ్యాక్ చేసిన సొమ్ములో ఐదు మిలియన్ డాలర్లను మీ ఖర్చు కోసం అట్టే పెట్టుకుని హ్యాక్ చేసిన క్రిప్టో కరెన్సీలో మిగిలిన దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. పాలినెట్ చర్యను కొందరు సమర్థించగా మరికొందరు హ్యాక్ అయిన సొమ్మను రాబట్టుకునేందుకు పాలినెట్‌వర్క్ వేసిన ఎత్తుగడగా పరిగణిస్తున్నారు. హ్యాకింగ్ చేసింది ఒక వ్యక్తా.. లేక ఒక టీమ్ కు చెందిన పనా అని తెలియాల్సి ఉంది.
హ్యాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచన లేదని ప్లాట్‌ఫాం స్పష్టం చేసింది. మళ్ళీ మిస్టర్ వైట్ హ్యాట్(మంచి దొంగ) ని చట్టపరంగా ఇబ్బందులు పెట్టే ఉద్దేశం పాలీ నెట్‌వర్క్‌కు లేదని తెలుపుతున్నాం. ఎందుకంటే మిస్టర్ వైట్ హాట్ పాలీ నెట్వర్క్, దాని వినియోగదారులకు క్రిప్టో కరెన్సీని తిరిగి ఇస్తుందని మాకు నమ్మకం ఉందని సంస్థ తెలిపింది. మొత్తం దోచుకున్న మొత్తాన్ని ప్లాట్ ఫామ్ ఇంకా రికవరీ చేయలేదు. హ్యాకర్ దాదాపు సగం మొత్తాన్ని తిరిగి ఇచ్చాడు. నిధులను అన్‌లాక్ చేయడానికి అవసరమైన రెండు కీల ద్వారా రక్షించబడిన జాయింట్ అకౌంట్లో సుమారు $ 235 మిలియన్లను జమ చేశాడు. పాలీ నెట్వర్క్ కు ఒక కీ ఇవ్వబడింది. హ్యాకర్ దగ్గర మరొకటి ఉంది. దోచుకున్న మొత్తాన్ని తిరిగి పొందడానికి కీని తిరిగి ఇవ్వమని హ్యాకర్‌ను ప్లాట్‌ఫామ్ కోరింది.