ఓ సంవత్సరం కిందటే ఆమె తన అన్నను కోల్పోయింది. ఆ బాధను ఎలాగోలా దిగ మింగుకున్నా.. అన్న లేడన్న లోటు ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆమె పెళ్లిని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి అనేది జీవితంలో ఎంతో గొప్ప ఘట్టం.. తన అన్న లేడనే చేదు నిజం ఆమెను వెంటాడుతూ ఉండగా.. పెళ్లి మండపానికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవానులు విచ్చేశారు. ఆ వధువుకు అన్న లేని లోటు తీరుస్తూ అంతా తామై పెళ్లి తంతును నిర్వహించారు.

అమరుడైన సహోద్యోగి కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్‌కు గౌరవ సూచకంగా, అనేక మంది CRPF జవాన్లు డిసెంబర్ 13, 2021న ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి విచ్చేశారు. శైలేంద్ర ప్రతాప్ సింగ్ సోదరి జ్యోతి వివాహానికి హాజరయ్యారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 2020 అక్టోబర్‌లో కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మరణించాడు. యూనిఫాంలో ఉన్న వ్యక్తులు సోమవారం పెళ్లికి వచ్చి జ్యోతి సోదరుడు చేయాల్సిన పనులన్నీ చేశారు. వారు ఆమెను ఆశీర్వదించారు, ఆమెకు బహుమతులు కూడా ఇచ్చారు. ఆమెను మండపానికి కూడా తీసుకుని వచ్చారు.

సీఆర్‌పీఎఫ్ జవాన్లు హాజరవ్వడంతో పెళ్లి వేడుకలో అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. వధువు కూడా భావోద్వేగానికి గురైంది. “వధువు సోదరుడి పాత్రను పోషిస్తున్నప్పుడు, జవాన్లు అమరవీరుడు శైలేంద్ర లోటును పూరించడానికి ప్రయత్నించారు,” అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. శైలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి, “నా కొడుకు ఇప్పుడు ఈ లోకంలో లేడు, కానీ ఇప్పుడు మనకు చాలా మంది కొడుకులు జవాన్ల రూపంలో ఉన్నారు, వారు ఎల్లప్పుడూ సంతోషంలో మరియు దుఃఖంలో మాకు అండగా ఉన్నారు” అని చెప్పుకొచ్చారు.

కొంతమంది సైనికులు యూనిఫాంలో ఉన్నారు, మిగిలిన వారు సాధారణ దుస్తులలో ఉన్నారు. బలగాల బృందం రాయ్‌బరేలీలోని శైలేంద్ర సింగ్ ఇంటికి చేరుకోగానే వివాహ వేడుకలో ఉన్న ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. పెళ్లికూతురు ప్రదక్షిణలు చేస్తుండగా సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడే ఉండగా.. ఆ సమయంలో చాలా మంది కళ్లలో నీళ్లు తిరిగాయి. గతేడాది జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ శైలేంద్ర ప్రతాప్‌సింగ్ వీరమరణం పొందారు. 2008లో సీఆర్‌పీఎఫ్‌లో చేరిన శైలేంద్ర ప్రతాప్ 110వ బెటాలియన్‌లో నియమితులయ్యారు. అతని కంపెనీ సోపోర్‌లో ఉండేది. అమరవీరుడి అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. అతని కుటుంబంలో తండ్రి నరేంద్ర బహదూర్ సింగ్, తల్లి సియా దులారీ సింగ్, భార్య చాందిని అలియాస్ దీప, సోదరీమణులు షీలా, ప్రీతి, జ్యోతి ఉన్నారు. శైలేంద్ర ప్రతాప్ సింగ్‌కు తొమ్మిదేళ్ల కుమారుడు కుశాగ్ర ఉన్నాడు.
శైలేంద్ర ప్రతాప్ సింగ్‌తో పాటు విధుల్లో ఉన్న అతని సహచరులు కొందరు సమీపంలోనే ఉన్నారు. శైలేంద్ర చెల్లెలు పెళ్లి జరుగుతోందని ఇతర జవాన్లకు సమాచారం అందించారు. సోమవారం జరిగిన వివాహ వేడుకకు సీఆర్పీఎఫ్ జవాన్లు హఠాత్తుగా రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. వివాహ వేడుకలో జవాన్లను చూసిన శైలేంద్ర కుటుంబసభ్యుల కన్నీటి పర్యంతమయ్యారు.





