సరిహద్దుల్లో సొరంగం.. ఆ యాత్రనే టార్గెట్

0
714
Pak tunnel detected at IB in Jammu

నిత్యం భారత్ ను దెబ్బ తీయాలని చూసే ఉగ్రవాదులు మరో కుట్రకు పన్నాగం పన్నారు. త్వరలో ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన కుట్రను సైన్యం భగ్నం చేసింది.

జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ రహస్య సొరంగాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్రోలింగ్ టీమ్ గుర్తించింది. సాంబా జిల్లాలోని చాక్‌ ఫఖీరా బోర్డర్‌ అవుట్‌పోస్ట్‌కు సమీపంలోని 150 మీటర్ల పొడవైన సొరంగం ఉన్నట్లు గుర్తించామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. ఇటీవలే ఈ సొరంగాన్ని తవ్వారని, పాక్ భూభాగం నుంచే మొదలైందని బీఎస్‌ఎఫ్‌ డీఐజీ ఎస్‌పీఎస్‌ సంధు చెప్పారు.

అవుట్‌ పోస్ట్‌కు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఈ సొరంగం ఉన్నట్లు తెలిపారు. ఈ సొరంగం నుంచి భారత్‌లోని చివరి గ్రామానికి దూరం కేవలం 700 మీటర్లేనని చెప్పారు. సుమారు 2 అడుగుల వెడల్పున్న సొరంగం బలోపేతం చేయడానికి ఉపయోగించిన 21 ఇసుక బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. సొరంగం లోపలికి వెళ్లి మరింత లోతుగా పరిశీలిస్తామని సంధు వివరించారు. అమర్‌నాథ్‌ యాత్రకు భంగం కలిగించేందుకు పాక్ తీవ్రవాదులు ఈ సొరంగం నుంచి భారత భూభాగంలోకి చొరబడేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల జమ్మూలోని సుంజ్వాన్‌ ప్రాంతంలో సీఐఎస్‌ఎఫ్‌ బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన సైన్యం.. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిఘా మరింత పెంచింది. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇందులో భాగంగానే ఈ టన్నెల్‌ను గుర్తించారు. దేశంలోకి చొరబాటుకు జైషే మహ్మద్‌కు ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్ల ఈ సొరంగాన్ని వినియోగించినట్టు భావిస్తున్నారు.

అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో, సరిహద్దు కంచె నుంచి 50 మీటర్ల దూరంలో భారత్‌వైపు నుంచి 900 మీటర్ల దూరంలో ఉన్న పాక్ పోస్ట్ చమన్ ఖుర్ద్ ఎదురుగా ఈ సొరంగం కనుగొన్నారు.. భారత్ చిట్టచివరి గ్రామానికి చమన్ ఖుర్ద్‌కు మధ్య కేవలం 700 మీటర్ల దూరం ఉందని భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఏడాదిన్నరలో సరిహద్దుల వద్ద ఐదు సొరంగాలను గుర్తించామని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ డీకే బూరా అన్నారు. దేశంలో విధ్వంసాన్ని సృష్టించేందుకు పాక్ దుష్ట పన్నాగం మరోసారి బయటపడిందని తెలిపారు.

హిమాలయాల్లో అమర్‌నాథ్‌లో ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది వస్తుంటారు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి అమర్‌నాథ్ యాత్రను రద్దుచేశారు. అంతకు ముందు ఏడాది 2019లో మధ్యలోనే యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం యాత్రను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. అయితే, ఈ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై ముష్కరులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here