నందాదేవి శిఖరంపై దౌళిగంగ ప్రళయం..!

0
796

గంగ పాపాల్ని పారదోలుతుంది. చంద్రుడు తాపాల్ని పోగొడతాడు. కల్పవృక్షం దారిద్య్రాన్ని మటుమాయం చేస్తుందన్నారు శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో.  గంగ పాపాల్ని మాత్రమే పొగొట్టడమే కాదు,  ప్రళయాలను కూడా సృష్టిస్తుందని లోకానికి ఆలస్యంగా తెలిసి వచ్చింది. ఉత్తరాది వరదలు దేశాన్ని దిగ్భ్రమకు గురిచేశాయి. నందాదేవి హిమనీనదం ప్రపంచంలోనే 23వ ఎత్తైన పార్వత సానువులు. కాంచనగంగ తర్వాత ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణి.

గంగానది ఉపనదులైన అలకనంద, రిషి గంగ, ధౌళి గంగ నదులకు వరద పోటెత్తిందని, దాంతో ఈ జల ప్రళయం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నదీమార్గంలోని పర్వతం పై నుంచి లక్షలాది మెట్రిక్‌ టన్నుల మంచు ఒక్కసారిగా, వేగంగా ఎలా కొట్టుకు వచ్చింది?

ఇస్రో శాస్త్రవేత్తలు తనకు చూపించిన చిత్రాల్లో.. వరద ఉధృతి ప్రారంభమైన చోట గ్లేసియర్ కనిపించలేదని, మంచు కిందకు జారిపడిపోయిన ఒక పర్వతం మాత్రం ఉందన్న వాదనల వెనుక ఉన్న నిజాలేంటి? ‘ద స్నో అండ్‌ అవలాంచీ స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌’సభ్యులకు కూడా అర్థం కాని విలయం వెనుక ఉన్న చరిత్రేంటి? మెరుపు వరదలకు గూఢచర్య రహస్యాలు, సీఐఏ అమర్చిన అణ్వస్త్ర పరికరాల పేలుడు కారణమా? శీతాకాలంలో గ్లేసియర్ ఫలకాలు ఎలా పేలిపోతాయి? అణ్వస్త్ర పరికరాల విస్ఫోటనం కారణంగానే జల ప్రళయం సంభవించిందా అనే అనుమానాలకు బలం చేకూరుస్తూ….చరిత్ర కొన్ని వాస్తవాలను బట్టబయలు చేసింది.

సౌందర్యానికీ, ధార్మిక పవిత్రతకూ నెలవు హిమాలయాలు. భారత ఉపఖండానికి ప్రకృతి గీసిన సరిహద్దులవి. దూది పింజలవలె ఎగురుతూ ప్రకృతి కాంతను మంత్రముగ్ధను చేసే మంచుదుప్పటి కప్పుకున్న కొండలు… మృత్యువును మోసుకొస్తాయని సాంకేతిక పరిఙ్ఞానం కూడా పసిగట్టలేకపోయింది.

ఫాల్గుణంలో వచ్చిన ధౌళిగంగ జల ప్రళయం హిమాలయ పర్వత సానువుల్లో మరణమృదంగం మోగించింది. మనుషులు కాగితప్పడవలవలె కళ్లముందే కొట్టుకుపోయారు. 2013లో బద్రీనాథ్, కేదారీనాథ్ క్షేత్రాల్లో వందలాది మంది భక్తులు మంచుపర్వతాల్లో కూరుకుపోయి ప్రాణాలు వదిలారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్‌ ని భారీ వరద ముంచెత్తినపుడు.. గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో.. మంచు పర్వతాల్లో దాగివున్న అణ్వస్త్ర పరికరాలు పేలిపోవటం వల్లే ఈ వరద ముంచెత్తిందనే వదంతులు వ్యాపించాయి.

నిజానికి.. హిమాలయల్లోని రయినీ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి.  50 మందికి పైగా ప్రజలు కనురెప్పపాటులో కనిపించకుండా పోయారు.  ఈ ప్రళయానికి కారణం హిమనీనదం -గ్లేసియర్ హఠాత్తుగా పేలిపోవడమేనని భావించారు. ఆలస్యంగా అనేక రహస్యాలు వెలుగు చూస్తున్నాయి. మంచు పర్వతాల్లో దాగివున్న అణ్వస్త్ర పరికరాలు పేలిపోవటం వల్లే ఈ వరద ముంచెత్తిందనే చారిత్రక వాస్తవాలు ఒక్కోటి బయట పడుతున్నాయి.

వర్షాకాలంలో హఠాత్తుగా కుంభవృష్టితో వరదలు ముంచెత్తలేదు. మండు వేసవిలో హిమఖండం కరిగి ఊరిపై విరుచుకుపడిన ఉదంతమూ జరగలేదు. ఎలాంటి కీడూ శంకించని వణికించే చలికాలంలో ఉన్నట్టుండి వచ్చిన మెరుపు వరదలు.

హిమాలయ పర్వత ప్రాంతాల ప్రజల భయాలకు మూలం.. పర్వత శిఖరాల మీద గూఢచర్యానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వాస్తవం.  ఉత్కంఠరేపే ఈ గాథలో అగ్రరాజ్యం అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ-నాటి భారత ప్రధాని నెహ్రూలు ప్రధాన భాగస్వాములు. ప్రపంచంలో అత్యుత్తమ పర్వతారోహకుల్లో కొందరి పేర్లు, ఎలక్ట్రానిక్ గూఢచర్య వ్యవస్థలు పనిచేయటానికి ఉపయోగించే అణుధార్మిక వస్తువులు ఈ వాస్తవ గాథలో వినిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

2018లోనే బెంగళూరుకు చెందిన దివేచా సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ చేంజ్‌ సంస్థ ఈ ప్రాంతం పరిస్థితిపై ఇచ్చిన వివరణాత్మక నివేదికను ఎవరూ తోసిపుచ్చలేరు. ఆ నివేదిక ప్రకారం 1991 నుంచి వాయవ్య హిమాలయాల్లోని సగటు ఉష్ణోగ్రత 0.66 సెల్సియస్‌ డిగ్రీలకు పెరుగుతూ వచ్చింది. ఇది అంతర్జాతీయ ఉష్ణోగ్రత పెరుగుదల కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

చంఢీగర్‌లోని స్నో అండ్‌ అవలాంచె స్టడీ ఎస్టాబ్లిష్‌మెంట్‌కి చెందిన శాస్త్రజ్ఞులు చెప్పిన దానిప్రకారం గత 25 సంవత్సరాల్లో వాయవ్య హిమాలయాల్లో శీతకాలాలు మరింతగా వెచ్చబడుతూ వచ్చాయని తెలుస్తోంది. సహస్రాబ్దాల పాటు అతిశీతల చలికాలాలకు మారుపేరుగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా దాని వ్యతి రేక దిశను ప్రదర్శించడం ప్రారంభించేసింది.

2013 విషాదం తర్వాత ఈ ప్రాంతంలో పరిశోధనలు చేసిన స్విస్‌ శాస్త్రవేత్తల బృందం హిమాలయ సానువుల్లో మొత్తం 251 హిమానీ నదాల సరస్సులున్నాయని తేల్చింది. వీటిల్లో 104 అత్యంత ప్రమాద కారులని, అలక్నంద సమీపంలో ఇవి 20 వరకూ వున్నాయని తేల్చారు. వీటివల్ల ముప్పు ఉన్నదని హెచ్చరించారు. ఇప్పుడు ఏ కారణం వల్ల ఈ దుర్ఘటన జరిగిందన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఉన్నట్టుండి ఒక పెద్ద పలక హిమఖండం నుంచి వేరుపడటంతో ఒక్కసారిగా సరస్సులోని జల మట్టం పెరిగి వరదలు పోటెత్తి వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా.

చైనా అణ్వస్త్ర పరీక్షలు, క్షిపణి ప్రయోగాల మీద నిఘా పెట్టేందుకు 1960ల్లో అమెరికా మన దేశంతో కలిసి ఎలా పనిచేసిందీ.. హిమాలయాల్లో అణుధార్మిక శక్తితో నడిచే పర్యవేక్షణ పరికరాలను ఎలా మోహరించిందీ అనే ఆసక్తికర వాస్తవాలు ఇటీవలే బట్టబయలయ్యాయి. చైనా తన తొలి అణ్వాయుధాన్ని 1964లో ప్రయోగించింది. ప్రచ్ఛన్న యుద్ధ భయం తీవ్రంగా ఉన్న రోజులవి. ఏ పద్ధతీ అయినా, ఎంతటి దారుణమైన కుట్ర అయినా, ఎలాంటి దారుణమైనా అన్యాయంగా తోచని కాలమది.

1965 అక్టోబరులో భారత్, అమెరికాకు చెందిన పర్వతారోహకుల బృందం ఒకటి.. ఏడు ప్లుటోనియం కాప్స్యూళ్లతో పాటు, నిఘా పరికరాలను తీసుకుని హిమాలయాల మీదకు బయలుదేరింది. మొత్తం 57 కిలోల బరువున్న ఈ పరికరాలను.. భారతదేశానికి ఈశాన్యంగా చైనా సరిహద్దులో, భారతదేశంలో రెండో అతిపెద్ద పర్వతమైన 7,816 మీటర్ల ఎత్తున్న నందాదేవి పర్వత శిఖరం మీద మోహరించింది.

అయితే…నందా దేవి శిఖరానికి మరికొంచెం దూరంలో ఉండగానే ముంచుకొచ్చిన మంచు తుపాను కారణంగా వారు పర్వతారోహణను విరమించి వెనుదిరిగాల్సి వచ్చింది. అలా తిరిగివచ్చే క్రమంలో నిఘా పరికరాలను అక్కడే ఒక వదిలిపెట్టారు.

అందులో.. ఆరడుగల పొడవున్న ఒక యాంటెనా, రెండు రేడియో కమ్యూనికేషన్ సెట్లు, ఒక పవర్ ప్యాక్, ప్లుటోనియం కాప్స్యూళ్లు ఉన్నాయి. పర్వత శిఖరం పక్క భాగంలో గాలి నుంచి రక్షణ కల్పిస్తున్న ఒక ‘గుహ’లో వాటిని దాచినట్లు అంతర్జాతీయ పత్రికల కథనాలు వెల్లడిస్తున్నాయి.

ఆ తర్వాత వసంత కాలంలో ఈ పర్వతారోహకుల బృందం మళ్లీ నందాదేవి పర్వతాన్ని అధిరోహిస్తూ.. తాము తమ పరికరాలను వదిలి పెట్టిన ప్రదేశానికి చేరుకున్నారు. కానీ ఆ పరికరాలు అదృశ్యమైపోయాయి. అది జరిగి అర్థ శతాబ్దానికి పైగా గడిచిపోయింది.

నందాదేవి పర్వతం మీదకు ఎంతో మంది సాహసయాత్రలు చేపట్టారు. ఇప్పటికీ.. ఆ ప్లుటోనియం కాప్స్యూల్స్ ఏమయ్యాయనేది ఎవరికీ తెలియదు. ఆ ప్లుటోనియం కాప్స్యూల్స్ ఇప్పటికీ ఒక హిమనీనదం అడుగున ఉండొచ్చు. ధూళిగా మారిపోతూ ఉండొచ్చు.

గంగా నది ముఖద్వారం దిశగా పయనిస్తుండొచ్చంటారు శాస్త్రవేత్తలు. ఒక అణు బాంబులో ప్రధాన పదార్థం ప్లుటోనియం. కానీ ప్లుటోనియం బ్యాటరీలలో వేరే రకం ఐసోటోపును – ప్లుటోనియం-238 అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు. దీనికి సగం జీవిత కాలం  అంటే అణుధార్మిక ఐసోటోపులో సగభాగం ధూళిలో కలిసిపోవటానికి పట్టే కాలం అన్నమాట – అంటే 88 సంవత్సరాల జీవిత కాలం ఉంటుంది.

అమెరికా పర్వతారోహకుల మీద స్థానికుల్లో సందేహం తలెత్తకుండా ఉండటానికి.. వారి శరీరం రంగు మారేలా భారతీయ సన్ టాన్ లోషన్‌ను ఉపయోగించారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. త్తైన పర్వత ప్రాంతాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నపుడు అది శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అధ్యయనం చేయటానికి తాము ఎత్తైన పర్వతాలను అధిరోహించే కార్యక్రమం చేపట్టామని స్థానికులకు చెప్పాలనీ…నార్త్ కరోలినాలోని సీఐఏ స్థావరం హార్వీ పాయింట్‌కు తీసుకెళ్లి, అణు గూఢచర్యం మీద శిక్షణనిచ్చారరనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

విఫలమైన ఈ పర్వతారోహణ పథకం విషయాన్ని భారతదేశంలో 1978 వరకూ రహస్యంగానే ఉంచారు. చైనా మీద గూఢచర్యం కోసం హిమాలయాల్లోని రెండు పర్వత శిఖరాల మీద అణుశక్తితో నడిచే పరికరాలను అమర్చటం కోసం.. అప్పుడే ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అమెరికా పర్వతారోహకుల్లో కొందరితో పాటు ఒక పర్వతారోహకుల బృందాన్ని అమెరికా నియమించిందట. 

1967లో.. నందా దేవికన్నా తక్కువ ఎత్తైన పర్వతం.. 6,861 మీటర్లు ఎత్తున్న నందాదేవి కోట్ మీద కొత్త పరికరాలను అమర్చటం కోసం మూడోసారి చేసిన ప్రయత్నం విజయవంతమైంది. హిమాలయాల మీద మూడేళ్ల కాలంలో ఈ గూఢచర్య పరికరాలను మోహరించటానికి.. మొత్తంగా 14 మంది అమెరికా పర్వతారోహకులకు నెలకు 1,000 డాలర్లు చొప్పున వేతనం చెల్లించారట. 

ఈ అణుశక్తి పరికరాలను నందాదేవి మీద మోహరించటానికి భారత్, అమెరికాలు  కలిసి పనిచేశాయని నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ 1978 ఏప్రిల్‌లో పార్లమెంటులో ప్రకటించారు.  అయితే.. ఆ మిషన్ ఎంతవరకూ విజయవంతమైందో మొరార్జీ వెల్లడించలేదు. హిమాలయాల్లో అదృశ్యమైన అణు పరికరాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఆ పరికరాలు మంచు చరియలు విరిగిపడినపుడు కొట్టుకుపోయి గ్లేసియర్‌లో చిక్కుకుపోయాయి. దాని ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమంటారు శాస్త్రవేత్తలు.

పవర్ ప్యాక్‌లోని ప్లుటోనియం క్షీణించిపోయి ధూళిలో కలిసిపోయేవరకూ – అందుకు శతాబ్దాలు పట్టొచ్చు – ఆ పరికరం అణుధార్మిక ముప్పుగా కొనసాగుతుంది.. అది హిమాలయాల మంచులోకి లీకై, గంగానది ముఖజలాల ద్వారా భారత నదీ వ్యవస్థలోకి చొరబడవచ్చనేది ఒక అంచనా.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలతో ఎలా మెలగాలన్న ముందుచూపూ, దౌత్యపరమైన స్పష్టత లేని కారణంగా నెహ్రూ, ఇందిరా గాంధీలు కొంతకాలం రష్యాతోనూ మరికొంత కాలం అమెరికాతోనూ సఖ్యత మెలిగేందుకు అస్పష్టమైన, దీర్ఘ దృష్టిలేని విధానాలను అవలంబించారు. ప్రచ్ఛన్న యుద్ధ తీవ్రత అమెరికా, రష్యాల అవకాశవాదాన్నీ, ప్రమాదకర వైఖరులను మరింత పెంచి పోషించింది. ఈ వైఖరి వల్లే హిమాలయ సానువులు అమెరికాకు ప్రయోగశాలగా మారేందుకు కారణం. యాభయ్యో దశకం తర్వాత సుమారుగా తూర్పు యూరప్ పతనం వరకూ భారత్ రష్యా అనుకూల వైఖరి అవలంబించింది. పీ.వీ.నరసింహారావు ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో కాస్తంత స్వతంత్ర వైఖరి మొదలైందని చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో మరింత ప్రతిపత్తిని కనపరుస్తోంది మన దేశం.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three × 5 =