యుద్ధం వచ్చేస్తోందా..? చైనా ఏం చేస్తోంది..?

0
844

పరిణత నేతలు, అన్నమాటకు కట్టుబడే రాజనీతి ఉన్నపుడే.. భిన్న సామాజిక రంగాలపై రాజకీయపరమైన సంకుచిత పరిణామాలు ప్రభావం చూపవు. పాకిస్థాన్ తాజా పరిణామాలు క్రీడారంగంపై ఎలాంటి ప్రభావం చూపాయో పరిశీలిస్తే.. ఆ దేశ స్థితి అర్థమవుతుంది. ఒక దేశం ఎలా ఉండకూడదో చెప్పడానికి ప్రబలమైన ఉదాహరణ పాకిస్థాన్.

న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డ్, ఇంగ్లండ్ క్రికెట్ జట్లు రావల్పిండిలో జరగాల్సిన టోర్నీని రద్దు చేసుకుని తమ తమ దేశాలకు చేరుకున్నాయి. ఉద్వేగపూరిత వాతావరణం, ఉద్రిక్త పరిస్థితి, పాక్ పాలకుల మూర్ఖపు వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ దేశాల ఉమ్మడి నిఘా కూటమి ‘ఫైవ్ ఐస్’ అత్యవసర హెచ్చరికల నేపథ్యంలో ఆటగాళ్లు హుటాహుటిన తిరుగుపయనమయ్యారు. పాకిస్థాన్ పర్యటనలో ఉన్న న్యూజిల్యాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టూ కివీస్ బోర్డు నిర్ధారించింది.

పొరుగుదేశం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్థాన్ కండ కావరానికి కొమ్ములొచ్చాయి. రాజ్యాంగస్ఫూర్తి లేని ప్రభుత్వం, హింసను ఆశ్రయించిన ఉగ్రవాద సంస్థలు, క్రిడాస్ఫూర్తిని మంటగలిపే ఆటగాళ్లూ…ఇదీ పాక్ చిత్రపటం. క్రికెటర్లు షోయబ్ అఖ్తర్, కమ్రాన్ అఖ్మల్, బాబర్ ఆజమ్ ల మాటలకు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాగుడుకూ వ్యత్యాసమే లేకుండా పోయింది.  

భద్రత కరువైన పాకిస్థాన్ లో ఎనమిదేళ్ల తర్వాత పర్యటనకు ఒప్పుకున్న న్యూజిల్యాండ్ విషయంలో ఇమ్రాన్ ప్రవర్తన ఇంత విస్మయం కలిగించేలా ఎందుకుంది? ఒక దేశానికి చెందిన ఆటగాళ్లు తమ దేశంలో ఉన్నపుడు ఒక ప్రధాని కనపరచాల్సిన పరిణతి ఇదేనా? ‘ఫైవ్ ఐస్’ నిఘా కూటమి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుక్కొచ్చింది? యాభై ఏళ్లుగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్న ఐదు Anglophone దేశాలు ఏ ఉద్దేశం కోసం ఫైవ్ ఐస్ ని ఏర్పాటు చేశాయి? ఇమ్రాన్ ఎందుకంత వదరుబోతులా వ్యవహరించాడు?

ఇలాంటి ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేస్తాను.

హమీద్ కర్జాయ్ ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో డురాండ్ లైన్ ను ఉదహరిస్తూ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లు ‘ఎవరూ విడదీయలేని సోదరులు’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ రెండు దేశాల మధ్య  2, 570 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్థాన్ ఎన్నడూ అంగీకరించలేదు. అయితే ఈ రెండు దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రసంస్థలే దక్షిణ, పశ్చిమ, మధ్య ఆసియాల్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాయి.

2001లో అమెరికా ‘వార్ ఆన్ టెర్రర్’ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ రెండు దశాబ్దాల పాటు అగ్రరాజ్యం ఆధీనంలో ఉంది. పాకిస్థాన్ వైట్ హౌజ్ చెప్పుచేతల్లో ఉంది. తాలిబన్-అమెరికా శాంతి చర్చలు మొదలైన తర్వాత పాకిస్థాన్ క్రమంగా చైనా వైపు మళ్లింది. తాలిబన్ శాంతి చర్చల సఫలమైతే…ఆ తర్వాత స్థితిని అమెరికా అంచనావేయలేకోపోయింది కానీ, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ కచ్చితమైన అంచనాలు వేసింది.

2019లో రష్యా కేంద్రంగా మొదలైన తాలిబన్ శాంతి చర్చల ప్రక్రియ విషయంలో చైనా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాలిబన్ నేతల్లో నిర్ణయాత్మక స్థానంలో ఉన్నవారిని గుర్తించింది. ‘క్వెట్టా’షూరాలోని కీలక నేతలైన హక్కాని నెట్ వర్క్ ని మచ్చిక చేసుకుంది.

తాలిబన్ బృందాన్ని చైనాకు ఆహ్వానించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చైనా ఏర్పాట్లు చేసింది. ఆగస్టులో పూర్తి స్థాయిలో అధికారాన్ని చేపట్టడం కన్నా ముందే జూలై 27,28 మధ్య తాలిబన్ పొలిటికల్ కమిషన్ చీఫ్ ముల్లా బరాదరీ, చైనా విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. మరోవైపు రష్యా, చైనాలు ఉమ్మడిగా ఆఫ్ఘనిస్థాన్ వ్యూహాన్ని తయారు చేస్తే ఆఫ్ఘనిస్థాన్, పశ్చిమాసియాతో పాటు మధ్య ఆసియాలోనూ తమ ప్రయోజనాలు చేకూరతాయని మౌనంగా ఎదురు చూస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నిలనాటికి చైనా గెలుపు ఫలితాన్ని బట్టి దక్షిణాసియా విధానాన్ని సిద్ధం చేయాలని చూసింది. చైనా అంచనాలు నిజయమయ్యాయి. బైడెన్ గెలిచాడు. చైనా, రష్యా- ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ లను పావులుగా చేసుకుని తదుపరి కథ నడిపించాలని చూస్తున్నాయి. చైనా, రష్యాల మద్దతుతో భారత్ పై పగతీర్చుకోవాలని చూస్తోంది పాకిస్థాన్. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ పై మూకుమ్మడి సాయుధ దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టే కశ్మీర్ లోయపై దాడి చేయాలన్నది జైషే మహ్మద్ ప్రణాళిక.

జైషే మహమ్మద్ ఇప్పటికే హెల్మండ్ ప్రావిన్స్ లో మూటువేసి దాడి పథకాలు రచిస్తోంది. తూర్పు ఆఫ్ఘనిస్థాన్ లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రమూకలను సిద్ధం చేస్తోంది. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వెంబడి సుమారు 3 వందల మంది ఉగ్రవాదులు అదనుకోసం ఏదురుచూస్తున్నారని సైన్యం ఇటీవలే ప్రకటించింది.  

భారత్, రష్యాల మధ్య బంధాలు చాలా విస్తృతమైనవి. ఈ ద్వైపాక్షిక బంధం వ్యూహాత్మక భాగస్వామ్య బంధంగా చెప్పుకోవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టాక.. ఇవి మరింత ప్రత్యేక వ్యూహాత్మక బంధాలుగా మారాయి. ఆర్థిక బంధాలు, ఆవిష్కరణలు, సైనిక పరమైన సాంకేతికత ఇలా అన్నింటిలోనూ ఇవి కనిపిస్తాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి భారత్-రష్యాల మధ్య బంధంలో చీలికలు వస్తున్నాయని రష్యా భావిస్తోంది. ముఖ్యంగా క్వాడ్ కూటమి విషయంలో రష్యాకు అభ్యంతరాలున్నాయి.

రష్యా, భారత్‌ల మధ్య దూరం పెరుగుతోందని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు దశాబ్దాల్లో తొలిసారిగా భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చలు గతేడాది వాయిదా పడటంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి. పుతిన్ ప్రధాని పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఏటా రెండు దేశాల మధ్య వార్షిక సమావేశం జరుగుతూనే వస్తోంది. ఈ సమావేశం వాయిదా పడటం ఇదే తొలిసారి.

అదే సమయంలో పాకిస్తాన్, రష్యాల మధ్య బంధాలు బలపడుతున్నాయనే సంకేతాలూ ఉన్నాయి. గతేడాది నవంబరు మొదటి వారంలో పాక్, రష్యా సైనిక బలగాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. మరోవైపు పాక్‌లో ఎల్‌ఎన్‌జీ పైప్‌లైన్‌ను రష్యా నిర్మిస్తోంది. ఒక రకంగా 2020 ఉత్తరార్ధం వరకూ పాకిస్థాన్ మాటలో విశ్వాసం లేదు. ఆర్థిక, సైనిక గందరగోళాల మధ్య, దౌత్యపరమైన విమర్శలనూ ఎదుర్కొన్నది.

2021 నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో చైనా సహా, రష్యా, పాకిస్థాన్ లకు ఊరట లభించింది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను స్వాధీనం చేసుకోగానే పాకిస్థాన్ స్వరం మారింది. తమ దేశంలో 40 వేల మంది ఉగ్రవాదులున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ పొగరుబోతు వ్యాఖ్యలు చేశాడు.

 విదేశీ సంకెళ్లను తెంచుకొన్న ఆఫ్ఘనీ ‘ముజాహుద్దీన్‌లు మా హీరోలు’ అంటూ తాలిబన్‌ నేతలకు పోటీగా ప్రకటనలు చేశాడు. అంతేకాదు గతంలో తాలిబన్లతో కలిసి ఫొటోలు దిగిన చరిత్ర కూడా ఇమ్రాన్‌కు ఉంది. ఆయన్ను ప్రత్యర్థులు ‘తాలిబ్ ఖాన్‌’ అంటూ సంబోదిస్తారు.

నేపాల్ – భారత్ ల మధ్య ఓపెన్ బార్డర్-సులువుగా సరిహద్దులు దాటే వీలు ఉండటంతో నేపాల్ ద్వారా బీహార్, జార్ఖండ్, సిక్కీం, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మీదుగా ఉగ్రమూకలను, స్లీపర్ సెల్స్ లను పంపి విధ్వంసం సృష్టిస్తూ, కశ్మీర్ లోయలోకి చొరబాట్లను పెంచాలన్నది పాక్ కుటిలయత్నం. చైనా మద్దతుతో భారత్ పైకి యుద్ధానికి తెగబడినా ఆశ్చర్యం లేదంటారు నిపుణులు.

సరిగ్గా ఇలాంటి ఉద్రిక్తత భౌగోళిక రాజకీయాల నేపథ్యంలోనే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ దేశాల నిఘా కూటమి ‘ఫైవ్ ఐస్’ అత్యవసర హెచ్చరికలను పంపింది. యూకే చెందిన సంస్థ GCHQ-జనరల్ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్, కెనడాకు చెందిన CSEC- Communications Security Establishment, న్యూజిలాండ్ కు చెందిన GCSB- Government Communications Security Bureau లతో పాటు అమెరికా-యూకేల మధ్య జరిగిన United Kingdom-United States Communication Intelligence Act –UKUSA ఒప్పందాల ద్వారా 1946లోనే ‘ఫైవ్ ఐస్’ అలయెన్స్ గా ఏర్పడి దేశాల మధ్య పరస్పరం నిఘా, సాంకేతిక సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఇందులో ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టోరేట్ –ASD, CIA, FBI, mi5, mi6, NSA లాంటి కీలక నిఘా సంస్థల మధ్య నిరంతరం సమాచార వినిమయం జరుగుతూ ఉంటుంది.  

అంటే రెండో ప్రపంచం ముగియగానే ఇంగ్లీష్ భాష మాట్లాడే ఐదు దేశాల మధ్య కుదిరిన కీలక ఒప్పందమిది. 2019 డిసెంబర్ లో భారత్, దక్షిణ కొరియా, జపాన్ లను సైతం ‘ఫైవ్ ఐస్’ సమాచార వినిమయంలో భాగం కావాలని అమెరికా కోరింది. Permanent Select Committee on Intelligence కు నేతృత్వం వహిస్తున్న ఆడమ్ షిఫ్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ప్రసంగవశాత్తు కోరారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లోని వ్యూహాత్మక అవసరాల రీత్యా ఫైవ్ ఐస్ లో ఈ మూడు దేశాల చేరిక అవసరమని పేర్కొన్నారు.

ఆసియాలో మరీ ముఖ్యంగా దక్షిణ, మధ్య ఆసియా పరిణామాల విషయంలో పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమాసియాలో ఏం జరిగినా అది చమురు వనరుల రవాణా, ధరలపై ప్రభావం పడుతుంది. మరికొన్ని దేశాలకు, బైడెన్-జిన్ పింగ్ ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయన్న అనుమానాలూ ఉన్నాయి.

ఇలాంటి స్థితిలో భారత్ అత్యంత కీలక దేశంగా మారింది. అయితే అంతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదమూ లేకపోలేదు. క్వాడ్ కూటమి బలపడటంపై గత మార్చిలో జరిగిన చర్చల తర్వాత తాలిబన్ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 22–27 తేదీల మధ్య ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. మోదీ ఆయనతో కూడా కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, ఆపిల్ సంస్థ అధిపతి టిం కుక్‌తో సహా అనేకమంది వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని సమావేశమవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో సైతం మోదీ ప్రసంగించనున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 + 20 =