More

    తాలిబాన్లకు ఊహించని షాకిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా

    తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నాక అనేక నిబంధనలను అమలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా మహిళలకు ఎటువంటి అవకాశాలను కూడా ఇవ్వడం లేదు. మహిళా క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లపై తాలిబాన్లు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు హ్యాపీగా మ్యాచ్ లను ఆడుకోవచ్చని ఇంతకు ముందే చెప్పారు. మహిళలకు ఒక నియమాలు.. పురుషులకు ఇంకో నియమాలా అంటూ ప్రపంచ వ్యాప్తంగా తాలిబాన్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

    తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తాలిబాన్లకు ఊహించని షాకిచ్చింది. తాలిబాన్ పాలకులు మహిళలను క్రికెట్ ఆడటానికి అనుమతించకపోతే ఆఫ్ఘనిస్తాన్ పురుషుల జట్టుతో టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తామని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. “మహిళలు క్రికెట్ ఆడటానికి అనుమతించబడుతుందని తాము అనుకోలేదు ఎందుకంటే ఇది అవసరం లేదు. మహిళా ఆటగాళ్లు వారి ముఖం మరియు శరీరాన్ని కనిపించేలా బట్టలు వేసుకోవడం ఇస్లాంకు వ్యతిరేకం” అని చెప్పాడు. దీనిని క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్రంగా తప్పుబట్టింది. అందుకే తాలిబాన్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చేలా ప్రకటనను వెల్లడించారు.

    న‌వంబ‌ర్ 27వ తేదీన హోబార్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గాల్సి ఉంది. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కొత్తగా పాల‌న చేప‌ట్టిన తాలిబాన్లు మ‌హిళ‌లు క్రికెట్ ఆడ‌రాదు అంటూ ఆదేశాలు ఇచ్చారు. తాలిబాన్ క‌ల్చ‌ర‌ల్ నేత అహ్మ‌దుల్లా వాసిక్ మాట్లాడుతూ.. మ‌హిళ‌లు క్రికెట్ ఆడ‌ర‌ని, ఇదే కాదు ఏ ఆట కూడా వాళ్లు ఆడ‌బోర‌న్నారు. మ‌హిళ‌లు క్రికెట్ ఆడాల్సినంత అవ‌స‌రం లేద‌న్నారు. క్రికెట్ ఆడుతున్న స‌మ‌యంలో ముఖం కానీ, శ‌రీరం కానీ బ‌హిర్గ‌తం అవుతుంద‌ని, ఇస్లాం ప్ర‌కారం మ‌హిళ‌ల్ని ఇలా చూడ‌లేమ‌న్నారు.

    ఈ వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా మండి పడింది. మ‌హిళ‌ల‌కు ఆడే అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్ పురుషుల జ‌ట్టుతోనూ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిన అవ‌స‌రం లేద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. మ‌హిళా క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెర‌గాల‌ని ఆశిస్తున్నామ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. అంద‌రికీ ఆట అన్న‌దే త‌మ నినాదం అని, మ‌హిళ‌ల‌ను కూడా స‌మానంగా చూడాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తాలిబాన్లు మ‌హిళా క్రికెట‌ర్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుంటే, అప్పుడు మెన్స్ జ‌ట్టుతో హోబర్ట్‌లో జ‌రిగే మ్యాచ్‌ను ర‌ద్దు చేయాల్సి ఉంటుంద‌ని ఆస్ట్రేలియా చెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల క్రికెట్‌కు మద్దతు ఇవ్వలేదనే మీడియా నివేదికలు నిజమైతే, హోబర్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం కుదరదని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్ఘనిస్తాన్ 3 సంవత్సరాల క్రితమే ఐసీసీ నుంచి పూర్తి సభ్యత్వ హోదా పొందింది. దీంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అనుమతి వచ్చింది. 2018 లో టీమిండియాతో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉంది. ఇప్పుడు తాలిబాన్ పాలన రావడంతో ఏమి జరుగుతుందా అనే భయాలు ఆఫ్ఘన్ క్రికెటర్లను కూడా వెంటాడుతూ ఉంది.

    మహిళా క్రీడాకారిణులను వెంటాడుతున్న తాలిబాన్లు:

    మహిళా క్రీడాకారిణులు తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక బయటకు రాకుండా దాక్కుంటున్నారు. మహిళా క్రీడాకారిణుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, మహిళలు ప్రస్తుతం సురక్షితంగా లేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్లు కాబూల్ లో ప్రవేశించినప్పటి నుంచి తన క్రికెట్ కిట్ దాచేశానని, ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టడంలేదని ఓ మహిళా క్రికెటర్ వివరించింది. తాలిబాన్లు ఇప్పటికే తమను బెదిరించారని, మరోసారి క్రికెట్ ఆడితే ప్రాణాలు పోతాయని హెచ్చరించారని ఆ మహిళా క్రికెటర్ వెల్లడించింది. తమకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని, ప్రతి రోజు రాత్రివేళల్లో తమ పరిస్థితిపై చర్చించుకుంటామని.. ప్రస్తుతానికి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిపింది. మరో మహిళా క్రికెటర్ ఆఫ్ఘన్ విడిచి వెళ్లిపోయింది. తొలుత తాలిబాన్లకు చిక్కకుండా ఉండేందుకు అనేక ఇళ్లు మారిన ఆ క్రికెటర్, చివరికి దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. క్రికెటర్లే కాదు, ఆఫ్ఘన్ లో మహిళా ఫుట్ బాల్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలుస్తోంది.

    Trending Stories

    Related Stories