సీపీఐ నారాయణ విశాఖ రుషికొండను సందర్శించారు. గతంలో రుషికొండ పర్యటనకు వెళ్తుండగా నారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రుషికొండను చూసేందుకు అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇవాళ ఆయన రుషికొండను పరిశీలించారు.
అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. కోర్టు అనుమతితో రుషికొండలో జరుగుతున్న నిర్మాణాల ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. కోర్టు ద్వారా అనుమతి కోరితే.. గతంలో తాను దేశంలో లేని సమయం చూసి అనుమతి ఇచ్చారని తెలిపారు. కోర్టు అనుమతి పొందాక కూడా మరో మూడు నెలలు ఎందుకు పట్టిందో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. బయట అనుకుంటున్నట్లు అక్కడ సీఎం కార్యాలయం లాంటి ఏర్పాట్లు ఏమీ కనిపించలేదని పేర్కొన్నారు. అక్కడ విలాసవంతమైన నిర్మాణం మాత్రం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన కొండను మాత్రం నాశనం చేసి.. కొండను చెక్కి పిలకలా వదిలేశారని చెప్పారు. అక్కడ ఏం కట్టినా సరే.. పాడు చేసిన ప్రకృతి మాత్రం తిరిగి రాదన్నారు. నేనైతే ప్రకృతిని రేప్ చేసినట్లుగానే భావిస్తానని వ్యాఖ్యానించారు. అయినా రుషికొండపైకి మీడియా ప్రజాప్రతినిధులను అనుమతిస్తే తప్పేంటి? కొంతమంది మంత్రుల మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న మాటల వల్లే ఈ రాద్ధాంతం అని చెప్పుకొచ్చారు.