బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి స్పందించారు. ఈ షో ఒక సాంఘిక దురాచారం వంటిదని విమర్శించారు. బిగ్ బాస్ షోను రద్దు చేసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ షోను రద్దు చేయాలని తెలంగాణలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను స్వీకరించలేదని తెలిపారు. ఏపీ హైకోర్టు మాత్రం స్పందించిందని, ఇందుకు ఏపీ హైకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. బిగ్ బాస్ షో ప్రారంభం నుంచి కూడా నారాయణ దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఆ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునపై కూడా తీవ్ర విమర్శలు చేశారు నారాయణ. టాస్కుల పేరుతో ఈ షోలో అశ్లీలకరమైన కంటెంట్ ను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై కూడా ఆయన మాట్లాడారు. ఇష్టం ఉన్నా లేకున్నా జనసేన, టీడీపీ, వామపక్షాలు ఏపీలో కలసి ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అప్పుడే ప్రజలకు, రాష్ట్రానికి మేలు చేకూరుతుందని నారాయణ అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని.. మోదీ ప్రభుత్వాన్ని జగన్ నిలదీయలేకపోతున్నారన్నారు. ప్రజలకు వందలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.