గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. తాజాగా అలహాబాద్ హైకోర్టు కూడా ఆ వాదనకు మద్దతు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆవును దొంగిలించి శిరచ్ఛేదం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జావేద్ అనే వ్యక్తికి బెయిలు నిరాకరించిన జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన ధర్మాసనం.. చంపే హక్కు కంటే జీవించే హక్కు ఉన్నతమైనదని తెలిపింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఓ వైపు డిమాండ్ ఉండగా.. దాని రక్షణ హిందువుల ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా దేశ సంస్కృతి, ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, దేశం బలహీనంగా మారుతుందని అలహాబాద్ హైకోర్టు బుధవారం నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. గోమాంసాన్ని భుజించడం హక్కు కానేకాదని.. నిందితుడిని బెయిలుపై విడుదల చేస్తే మళ్లీ అటువంటి నేరానికే పాల్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. గోవు ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకున్న వారిలో ముస్లిం పాలకులు కూడా ఉన్నారని న్యాయస్థానం గుర్తు చేసింది.
సంస్కృతి, విశ్వాసాలు దెబ్బతింటే దేశం బలహీనంగా మారుతుందని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ, దానికి హాని తలపెట్టే వారిని కఠినంగా శిక్షించేలా పార్లమెంటు ఓ చట్టం తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. భారత సంస్కృతిలో గోవుకు విశిష్ట స్థానం ఉందని, ప్రాథమిక హక్కు అనేది గోమాంసం భుజించే వారికి ప్రత్యేకం ఏమీ కాదని తేల్చి చెప్పింది. గోవును పూజించే వారికి, దానిపై ఆర్థికంగా ఆధారపడే వారికీ ఇది ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. “నిందితుడిది.. మొదటి నేరం కాదు. ఇంతకు ముందు కూడా అతను గోవధకు పాల్పడ్డాడు “అని కోర్టు తెలిపింది. దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదలైతే, అతను మళ్లీ అదే నేరానికి పాల్పడి సమాజంలోని పర్యావరణాన్ని దెబ్బతీసేలా చేస్తాడు అంటూ బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది కోర్టు. “ప్రాథమిక హక్కు కేవలం గోమాంసం తినేవారికి మాత్రమే కాదు. ఆవును ఆరాధించే వారికి కూడా ఉంటుంది. జీవించే హక్కు చంపే హక్కు మరియు ఆవు మాంసం తినే హక్కు ఎప్పటికీ ప్రాథమిక హక్కుగా పరిగణించబడదని అలహాబాద్ హై కోర్టు తెలిపింది.
“ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును తీసుకురావాలి. ఆవులను జాతీయ జంతువుగా ప్రకటించాలి. వాటికి హాని కలిగించే వారిపై కఠినమైన చట్టాలు చేయాలి. గోసంరక్షణ గురించి మాట్లాడే వారికి కూడా అండగా ఉండాలి. కానీ గోసంరక్షణ పేరుతో డబ్బు సంపాదించడమే లక్ష్యం గా పెట్టుకున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది. “గోసంరక్షణ ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు, కానీ ఆవు భారతదేశ సంస్కృతి. దాన్ని కాపాడే హక్కు దేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి, మతానికి సంబంధం లేకుండా ఉంటుంది” అని కోర్టు పేర్కొంది. “మన ‘సంస్కృతి’ ని మనం మర్చిపోయినప్పుడు, విదేశీయులు మనపై దాడి చేసి, బానిసలుగా చేసిన ఉదాహరణలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఈరోజు కూడా మేల్కొనకపోతే.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ దండయాత్ర ని మనం మర్చిపోకూడదని” కోర్టు తెలిపింది. “ప్రపంచంలోని వివిధ మతాల ప్రజలు నివసించే ఏకైక దేశం భారతదేశం, వారు విభిన్నంగా ఆరాధించవచ్చు, కానీ వారి ఆలోచనలు దేశం విషయంలో మాత్రం ఒకే విధంగా ఉంటాయి. భారతీయులు ఒకరి మతాలను మరొకరు గౌరవిస్తారు. ఇతరుల ఆచారాలు మరియు ఆహార అలవాట్లను గౌరవిస్తారు. అటువంటి పరిస్థితిలో భారతదేశాన్ని ఏకం చేయడానికి మరియు దాని విశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేసినప్పుడు, దేశ ప్రయోజనాలపై విశ్వాసం లేని కొందరు వ్యక్తులు దానిని బలహీనపరిచేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడతారు ”అని కోర్టు తెలిపింది.