More

    ఫ్యాక్ట్ చెక్: టెలిగ్రామ్ ఛానల్ ను ఉపయోగించి వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవచ్చా..?

    భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఎన్నో తప్పుడు వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని మెసేజీలను నిజమేనని నమ్మేస్తూ ఫార్వర్డ్లు కొడుతూ ఉన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.

    వ్యాక్సిన్ల విషయంలో కూడా ఎంతో తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తాజాగా ‘MyGov Corona Vaccine Appt’ అనే టెలీగ్రామ్ ఛానల్ ద్వారా కోవిద్-19 వ్యాక్సినేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని చెబుతూ ఉన్నారు. అయితే ఇదంతా తప్పుడు వార్త అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వైరల్ అవుతున్న పోస్టులో ‘MyGov Corona Vaccine Appt’ అనే టెలిగ్రామ్ ఛానల్ తో పాటూ.. ఓ ఫోన్ నెంబర్ కూడా వైరల్ అవుతూ ఉంది. వీటిని నమ్మకండి అంటూ భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వైరల్ అవుతున్న పోస్టుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కూడా ఉండడాన్ని గమనించవచ్చు.

    పిఐబి ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) సంస్థ ఈ వైరల్ పోస్టు ‘ఫేక్ న్యూస్’ అంటూ కొట్టివేసింది. “Claim:#COVID19 vaccination appointment can be booked on Telegram using ‘MyGov Corona Vaccine Appt’ #PIBFactCheck:This image is #Morphed. Neither this number nor Telegram account is associated with @mygovindia Register for vaccine on http://cowin.gov.in,UMANG or Aarogya Setu.” అంటూ అందుకు సంబంధించిన ట్వీట్ చేసింది. కోవిద్-19 వ్యాక్సినేషన్ ఇలా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా జరగడం లేదని ప్రభుత్వానికి చెందిన యాప్స్ ద్వారాను, వెబ్సైట్ ద్వారాను జరుగుతూ ఉందని క్లారిటీ ఇచ్చింది. @mygovindia కు చెందిన ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ జరగడం లేదని తేల్చి చెప్పింది. వైరల్ పోస్టులో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ కు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ వైరల్ పోస్టును ఎవరూ నమ్మకండని సూచించింది.

    భారతదేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సిన్ల కోసం రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉండగా.. ఇలా కొన్ని తప్పుద్రోవ పట్టించే లింక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో ప్రజలు తమ డేటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంట్రీ చేయకూడదని అధికారులు సూచించారు. కోవిద్-19 వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ CoWIN పోర్టల్ ద్వారా UMANG, Aarogya Setu యాప్స్ ద్వారా జరుగుతూ ఉంది.

    Trending Stories

    Related Stories