చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు

0
846

చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. పలు నగరాల్లో కరోనా మరణాలు సంభవిస్తూ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నెలలో షాంఘైలో లాక్‌డౌన్ విధించారు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా మరణాలు నమోదైనట్లు తొలిసారిగా ప్రకటించింది చైనా. షాంఘై మునిసిపల్ ప్రభుత్వం ప్రకారం, ఆదివారం నాడే ముగ్గురు వ్యక్తులు మరణించారు. 89, 91 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని అందరికీ అంతర్లీన వ్యాధులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఈశాన్య ప్రావిన్స్ జిలిన్‌లో మార్చి మధ్యలో ఇద్దరు వ్యక్తులు మరణించిన తర్వాత కొత్తగా నివేదించబడిన మరణాలివే. గత సంవత్సరం నుండి డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల భయంతో ఈ ప్రాంతంలో జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తూ ఉన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్, కైక్సిన్.. ఇతర స్థానిక మీడియా ప్రకారం, షాంఘైలో మరణాలు ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా సంభవించాయి. ఆదివారం, చైనాలో 26,155 కొత్త కేసులు నమోదయ్యాయి, వీటిలో 3,529 మినహా మిగిలిన కేసుల్లో ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. షాంఘైలోనే మొత్తం 95%.. 24,820 మంది కరోనా రోగులు ఉన్నారు. మార్చి చివరి నుండి నగరంలో 300,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. షాంఘై గత వారం ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.

హాంకాంగ్ లో అధికారులు విధించిన COVID-19 పరిమితులు, పరిమిత డిమాండ్ కారణంగా ఎయిర్ ఇండియా విమాన సేవలను రద్దు చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. “హాంకాంగ్ అధికారులు విధించిన ఆంక్షలు మరియు సెక్టార్‌పై పరిమిత డిమాండ్ కారణంగా, హాంకాంగ్‌కు ఏప్రిల్ 19 మరియు 23వ తేదీలలో మా విమానాలు రద్దు చేయబడ్డాయి” అని ఎయిర్‌లైన్ ట్విట్టర్‌లో పేర్కొంది. హాంకాంగ్‌లో ల్యాండ్ అయిన ఒక విమానంలో ముగ్గురు ప్రయాణీకులకు శనివారం కోవిడ్-19 పాజిటివ్ రావడంతో.. ఏప్రిల్ 24 వరకు ఎయిర్ ఇండియా సేవలను నిషేధించినట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. “ఏప్రిల్ 16న ఎయిర్ ఇండియా AI316 ఢిల్లీ-కోల్‌కతా-హాంకాంగ్ విమానంలో ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్-19 పాజిటివ్ తేలింది” అని అధికారి తెలిపారు. హాంకాంగ్ ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం, ప్రయాణానికి 48 గంటల ముందు చేసిన కోవిడ్-19 పరీక్షలో నెగటివ్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే భారతదేశం నుండి ప్రయాణీకులు హాంకాంగ్‌కు అనుమతిస్తారు.