దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. కేరళ, తమిళనాడులో భారీగా కేసులు..!

0
736

భారతదేశంలో గత 24 గంటల్లో 41,649 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 37,291 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993కు చేరింది. గత 24 గంటల్లో 593 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,23,810కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,81,263 మంది కోలుకున్నారు. 4,08,920 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు అధికారులను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. కేరళలో వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేరళ రాష్ట్రంలో ఇంకా 1,60,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 33,70,137 మంది కరోనా కోరల్లో చిక్కుకోగా, 16,701 మంది మరణించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.61 శాతంగా ఉంది. తమిళనాడులోనూ కేసులు స్వల్పంగా పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించింది. అనుమతించిన దానికంటే ఎక్కువమంది గుమికూడిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్ట్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం 2021 ఆగస్టు 31 అర్ధరాత్రి 23.59 గంటల వరకు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో డీజీసీఏ తెలిపింది. ఈ నిషేధం కార్గో (రవాణా) విమానాలకు వర్తించదని తెలిపింది. అయితే కొన్ని సెలెక్ట్ చేసిన రూట్లలో అవసరాలను బట్టి కేస్ టు కేస్ బేసిస్ కింద అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలను అనుమతిస్తామని వెల్లడించింది.

30-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 80,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,068 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 337 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,127 మంది కరోనా నుంచి కోలుకోగా, 22 మంది మరణించారు. కరోనా మృతుల సంఖ్య 13,354కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,64,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,29,565 మంది పూకోలుకున్నారు. ఇంకా 21,198 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించగా 614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 73 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,44,330 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,31,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,800కి చేరింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here