భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 6,358 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో కరోనా కారణంగా 6,450 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 75,456 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 186 మంది కోలుకున్నారని వివరించింది. తెలంగాణలో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, వారిలో 10 మంది కోలుకున్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరు కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 17,940 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 19 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 121 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఏపీలో ఇప్పటిదాకా 20,76,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,60,957 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,099 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,490కు చేరుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,839 శాంపిల్స్ పరీక్షించగా, 182 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 90 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 181 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,80,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,73,404 మంది కోలుకున్నారు. ఇంకా 3,417 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,023కి పెరిగింది.