దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. ఇకపై నో కాలర్ ట్యూన్ కూడా..!

0
745

భారత దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,270 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 15,859 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో క‌రోనా నుంచి మ‌రో 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 183.26 కోట్ల టీకాల‌ను పంపిణీ చేశారు.

ఏపీలో గడచిన 24 గంటల్లో 8,948 కరోనా పరీక్షలు నిర్వహించగా, 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో 11 కొత్త కేసులు వెల్లడయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 55 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,475 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,378 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇంకా 367 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.

భారతదేశంలో ఈ నెల 31 నుంచి కేవలం మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధ‌న‌లు మాత్ర‌మే మాత్రమే కొనసాగనున్నాయి. దేశంలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇకపై కరోనా కాలర్‌ ట్యూన్ ల‌కు స్వ‌స్తి చెప్పాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం ఓ లేఖ రాసింది. సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘంతో పాటు మొబైల్‌ వినియోగదారుల నుంచి కాలర్‌ ట్యూన్‌ నిలిపివేయాలని విజ్ఞప్తులు వచ్చాయ‌ని అందులో పేర్కొంది. ఈ నేప‌థ్యంలో వాటిని నిలిపివేయాల‌న్న అంశాన్ని కేంద్ర స‌ర్కారు పరిశీలిస్తోందని తెలిసింది. క‌రోనా కాలర్‌ ట్యూన్స్‌ కారణంగా అత్యవసర సమయాల్లోనూ ఫోన్‌కాల్‌ మాట్లాడటంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని ప్రజల నుంచి కూడా త‌మ‌కు విజ్ఞప్తులు అందాయ‌ని దీంతో కేంద్రం ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తున్నట్లు ప్ర‌భుత్వ‌ అధికార వర్గాలు చెప్పాయి.