భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 356 మంది కరోనాతో మృతి చెందారు. 15,951 మంది కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,42,02,202కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 3,35,83,3018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,55,068 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 1,63,816 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 66 కొత్త కేసులు నమోదు కాగా, వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 104 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,453 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,62,481 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,023 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,949కి పెరిగింది.
25-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 27,641 కరోనా పరీక్షలు నిర్వహించగా 295 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 69 కొత్త కేసులు నమోదు కాగా, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 560 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,872 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,44,692 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,350కి పెరిగింది.
మరో వైపు ఏవై.4 అనే కరోనా వేరియంట్ మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ఈ వేరియంట్ బారినపడ్డారు. వీరంతా వ్యాక్సినేషన్ పూర్తయిన వారేనని.. వీరందరికీ ఏవై.4 వేరియంట్ సోకిన విషయాన్ని దేశ రాజధానిలోని జాతీయ వ్యాధి నివారణ కేంద్రం నిర్ధారించింది. ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు బాధితుల నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. చికిత్స అనంతరం బాధితులు కోలుకున్నట్టు మధ్యప్రదేశ్ వైద్య అధికారులు తెలిపారు.