National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,08,921 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 2,95,955 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,71,57,795కు చేరింది. 4,157 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 3,11,388 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,43,50,816 మంది కోలుకున్నారు. 24,95,591 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,06,62,456 మందికి వ్యాక్సిన్లు వేశారు.

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ప్రస్తుతం అనేక కరోనా వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ, అన్నింట్లోకి బి.1.617 వేరియంట్ అత్యంత తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని తెలిపారు. దేశంలోని 55 శాతం కొవిడ్ కేసులకు ఈ బి.1.617 వేరియంటే కారణమని హర్షవర్ధన్ తెలిపారు. సోమవారం ఉదయం నాటికి ఇన్సాకోగ్ (ఐఎన్ఎస్ఏసీఓజీ) 25,739 శాంపిల్స్ ను పరీక్షించి, వాటిలోని కరోనా వేరియంట్ల జన్యుమార్పుల గురించి తెలుసుకున్నట్లు వెల్లడించారు. వాటిలో 9,508 శాంపిళ్లలో బి.1.617 వేరియంట్ ను గుర్తించింది. కరోనా వేరియంట్ల జన్యు ఉత్పరివర్తనాల గురించి తెలుసుకుంటూనే ఉంటామని హర్షవర్ధన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న 79 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సీరో సర్వేలో తేలింది. టీకాలు తీసుకోకుండా ఉన్న వాళ్లలో కూడా.. 59.5 శాతం మందిలోనూ యాంటీబాడీలు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 63.5 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 56.38 శాతంగా ఉంది. ఏప్రిల్ 9 నుంచి 16వ తేదీ మధ్య ఒక్కో జిల్లాలో 4,200 మంది చొప్పున మొత్తం 54,600 మంది నుంచి నమూనాలు సేకరించింది వైద్య ఆరోగ్యశాఖ. ఇందులో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారు, అస్సలు తీసుకోని వారు ఉన్నారు. రెండు డోసులు పొందిన వారిలో 7,800 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. వీరిలో 79 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఫలితాల్లో తేలింది. టీకాలు అస్సలు తీసుకోని 46,800 నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా 59.5 శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందినట్టు తెలుసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =

Back to top button