భారత దేశంలో గత 24 గంటల్లో 1,660 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,100 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,741 యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు 1,82,87,68,476 డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారు. పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా లెక్కల్లో చూపని మరణాలను ఈ సంఖ్యకు జత చేసినట్టు తెలిపింది. మహారాష్ట్రలోని 4,700 మరణాలు, కేరళలోని 81 మరణాలను సవరించడంతో ఈ తేడా కనిపించింది. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 20,379 కరోనా పరీక్షలు నిర్వహించగా, 36 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 80 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,91,074 మంది కరోనా బారినపడగా 7,86,388 మంది కోలుకున్నారు. ఇంకా 575 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 10,515 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలలో కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 55 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,407 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,248 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 429 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 14,730 మంది మరణించారు.