ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 58,835 కరోనా పరీక్షలు చేపట్టగా 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,652 కొత్త కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 1,690 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,620 కేసులు, అనంతపురం జిల్లాలో 1,047 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 18,373 మంది కరోనా నుంచి కోలుకోగా, 96 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 14 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,93,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13,79,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,03,762 మంది చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్, రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు మరొకొందరు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. బ్లాక్ ఫంగస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంజక్షన్లు తెప్పించాలని అధికారులను ఆదేశించారు. వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోందని, వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.