దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. వెంకయ్య నాయుడుకు మరోసారి కరోనా

0
705

దేశంలో క‌రోనా కేసుల వ్యాప్తి కొన‌సాగుతోంది. భారత దేశంలో గత 24 గంటల్లో 3,06,064 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. గత 24 గంటల్లో క‌రోనాతో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి కొత్త‌గా 2,43,495 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం హోం క్వారంటైన్లు, ఆసుప‌త్రుల్లో 22,49,335 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇంతకు ముందు ఓసారి కరోనా నుంచి కోలుకున్న ఆయనకు రెండోసారి కరోనా సోకింది. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయన హైదరాబాదులోని తన నివాసంలో వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండనున్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వాళ్లు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు 2020 సెప్టెంబరులోనూ కరోనా బారినపడ్డారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 93,397 శాంపిల్స్ పరీక్షించగా 3,603 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,421 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,707 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,34,815 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,98,649 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 32,094 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,072కి పెరిగింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,650 శాంపిల్స్ పరీక్షించగా 14,440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,969 మంది ఆరోగ్యవంతులు కాగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21,80,634 మందికి కరోనా సోకగా, వారిలో 20,82,482 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 83,610 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,542కి పెరిగింది.