National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. 88 రోజుల కనిష్ట స్థాయికి..!

భారతదేశంలో కరోనా కేసుల కట్టడి కొనసాగుతూ ఉంది. 88 రోజుల క‌నిష్ఠ స్థాయిలో కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. భారత దేశంలో గత 24 గంటల్లో 53,256 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 78,190 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కు చేరింది. మరో 1,422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,88,135కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,88,44,199 మంది కోలుకున్నారు. 7,02,887 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

20-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 1,00,001 కరోనా పరీక్షలు నిర్వహించగా 5,646 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,098 కొత్త కేసులు నమోదు కాగా, అతి తక్కువగా కర్నూలు జిల్లాలో 127 కేసులు గుర్తించారు. అదే సమయంలో 7,772 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, రాష్ట్రవ్యాప్తంగా 50 మంది మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 12,319కి పెరిగింది. ఏపీలో ఇప్పటిదాకా 18,50,563 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 17,75,176 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 63,068 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 87,854 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,006 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 141 కేసులు నమోదయ్యాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో రాష్ట్రంలో 1,798 మందికి కరోనా నయం కాగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,567 మరణాలు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటిదాకా 6,13,202 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,91,870 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,765 మందికి చికిత్స జరుగుతోంది.

ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ లో మెగా వ్యాక్సినేషన్ ను నిర్వహించారు. భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డు నమోదు చేసుకుంది. ఒకే రోజు 13,26,271 డోసుల వేక్సినేషన్ తో సరికొత్త రికార్డును లిఖించింది. గతంలో ఏపీలో ఒక్కరోజులో 6 లక్షల మందికి డోసులు ఇవ్వడం ఇప్పటి దాకా జాతీయ రికార్డుగా ఉంది. ఆదివారం నాడు జాతీయస్థాయిలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీ వాటా 47 శాతం ఉంది. ఏపీ తర్వాత రాజస్థాన్ లో 12 శాతం వ్యాక్సినేషన్ జరగ్గా, గుజరాత్ లో 7 శాతం, తెలంగాణలో 4 శాతం వ్యాక్సినేషన్ జరిగాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × three =

Back to top button