ఇన్ని రోజులూ భారీగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి. నాలుగో వేవ్ వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని పెరుగుతున్న కరోనా కేసులను చూస్తుంటే తెలుస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 2,380 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 13,433 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. కరోనా నుంచి నిన్న 1,231 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య మొత్తం 4,25,14,479గా ఉందని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా వల్ల 56 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మృతుల సంఖ్య మొత్తం 5,22,062కి పెరిగింది.
ఏపీలో గత రెండున్నరేళ్ల తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో 2,941 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకే ఒక్క పాజిటివ్ కేసు వెల్లడైంది. ఆ కేసును విశాఖ జిల్లాలో గుర్తించారు. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. కేరళ, మిజోరం, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలలో పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉండడం కలవరం కలిగిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అలర్ట్ చేసింది. జూన్ నెలలో కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పరిశోధకులు అంటున్నారు. కరోనా నుండి కోలుకున్న 30 శాతం మందిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.