More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,47,254 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 703 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంట‌ల్లో 2,51,777 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 20,18,825 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

    కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 6 నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లలు మాస్కులను ధరించడంపై వారికున్న అవగాహనను బట్టి ధరించవచ్చని కేంద్రం తెలిపింది. 12 ఏళ్లు వయసు దాటిన పిల్లలు పెద్దల మాదిరే మాస్కులు ధరించాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించిన తర్వాత ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉందని తేలిందని ఆరోగ్య శాఖ తెలిపింది. లక్షణాలు లేకపోవడం, తక్కువ లక్షణాలు ఉన్న కేసులలో చికిత్స కోసం యాంటీమైక్రోబియల్స్ థెరపీని సిఫారసు చేయడం లేదని కేంద్రం తెలిపింది. ఓ మాదిరి లేదా తీవ్ర లక్షణాలు ఉన్నవారికి వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉందనే అనుమానం ఉంటే తప్ప యాంటీమైక్రోబియల్స్ ఇవ్వకూడదని చెప్పింది. చికిత్సలో స్టెరాయిడ్లను సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన వ్యవధిలో వాడాలని తెలిపింది. తొలి మూడు నుంచి ఐదు రోజుల వరకు స్టెరాయిడ్స్ వాడవద్దని సూచించింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,215 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,207 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,645 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,825 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,067కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,22,403 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,91,703 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 26,633 మంది చికిత్స పొందుతున్నారు.

    ఏపీలో గత 24 గంటల్లో 12,615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,338 కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 216 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,674 మంది కోలుకోగా… ఐదుగురు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,40,056కు పెరగగా ఇప్పటి వరకు 20,71,658 మంది కోలుకున్నారు. మొత్తం 14,527 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Trending Stories

    Related Stories