భారతదేశంలో గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 11,919 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే సమయంలో 11,242 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 470 మంది మృతి చెందారు. ఈ మరణాల్లో 388 కేరళలో సంభవించాయి. ఇప్పటి వరకు దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,64,623కి చేరుకుంది. మొత్తం 3.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,28,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 114 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వేశారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,332 పరీక్షలు నిర్వహించగా.. 230 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,70,516కి చేరింది. అదే సమయంలో కరోనా వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,421కి చేరింది. 24 గంటల వ్యవధిలో 346 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,53,480కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,615 యాక్టివ్ కేసులున్నాయి.