భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. అందుకు కారణం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అని నిపుణులు అంటూ ఉన్నారు. భారతదేశంలో గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,596 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 230 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదవ్వడం ఇదే..! గత 24 గంటల్లో 166 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,89,694 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3.40 కోట్ల మంది కరోనా బారిన పడగా 3.34 కోట్ల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.12 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,52,290 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు.
17-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 31,712 కరోనా పరీక్షలు నిర్వహించగా, 432 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో 586 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 14,307కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,472 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,40,131 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,034 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కరోనా కేసులు నమోదు కాగా.. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మెదక్, ములుగు, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కకొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 176 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,68,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,61,093 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,924 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,938కి పెరిగింది.