More

    గత 24 గంటల్లో కోలుకున్న 4,22,436 మంది

    భారతదేశంలో గత 24 గంటల్లో 4,22,436 మంది కోలుకున్నారు. కరోనా కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య అధికమవుతూ ఉండడంతో అధికారులతో పాటూ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో గత 24 గంటల్లో 2,63,533 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 4,22,436 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,52,28,996కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,329 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 2,78,719కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,15,96,512 మంది కోలుకున్నారు. 33,53,765 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,44,53,149 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    ఇక భారత్ లో పలు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు వస్తూ ఉండడం.. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) కూడా మార్కెట్‌లోకి విడుదలవ్వడంతో రాబోయే రోజుల్లో కరోనా మరణాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 2డీజీ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు అందజేశారు. వీటిని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశారు. మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేశారు. పొడి రూపంలో ఉన్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. ఈ ఔషధం రెండో విడత పంపిణీ ఈ నెల 27న చేపడతామని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తెలిపారు. రెగ్యులర్‌ ఉత్పత్తి జూన్‌ తొలి వారంలో ప్రారంభమవుతుందని.. దేశవ్యాప్తంగా ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందన్నారు. ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో డీఆర్‌డీవో 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీని వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చింది.

    Trending Stories

    Related Stories