భారతదేశంలో గత 24 గంటల్లో 10,197 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 301 మంది కరోనాతో కన్నుమూశారు. 12,134 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 1,28,555కు తగ్గి 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయి. గత 44 రోజులతో పోలిస్తే రోజువారీ పాజిటివ్ రేటు రెండు శాతం తగ్గి 0.82 శాతానికి చేరుకోగా, వారపు పాజిటివిటీ రేటు గత 54 రోజుల కంటే 2 శాతం తగ్గి 0.96 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మొత్తం కేసులో దాదాపు సగం కేసులు ఒక్క కేరళలోనే నమోదు అయ్యింది. 5,516 కేసులు గత 24 గంటల్లో కేరళలో నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన 301 మరణాల్లో 210 మంది కేరళలోనే మరణించారు. తాజాగా కరోనా కేసులు గణాంకాల ప్రకారం ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 3.44 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4,64,153 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3.38 కోట్ల మంది కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 37,283 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 55 కొత్త కేసులు నమోదు కాగా, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,889 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,66,176 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,976కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 26,514 కరోనా పరీక్షలు నిర్వహించగా, 191 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 2, కడప జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 416 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,418కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,286 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,53,134 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,734 మంది చికిత్స పొందుతున్నారు.