భారత్ లో కరోనాను కట్టడి చేయడానికి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఎంతగానో కష్టపడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! కరోనా కట్టడిని తగ్గించడానికి పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. గత కొద్దిరోజులుగా మూడు-నాలుగు లక్షల్లో నమోదైన కరోనా కేసులు తాజాగా తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య చాలా రోజుల తర్వాత మూడు లక్షల కన్నా తక్కువగా నమోదైంది.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన కరోనా లెక్కల ప్రకారం కొత్తగా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 3,78,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మృతుల సంఖ్య 2,74,390కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076 మంది కోలుకున్నారు. 35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 44,985 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,816 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో 658 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,892 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు.తెలంగాణలో ఇప్పటివరకు 5,28,823 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4,74,899 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 50,969 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,955కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 94,550 కరోనా పరీక్షలు నిర్వహించగా 24,171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 3,356 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 2,885 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,876 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,426 కేసులు, విశాఖ జిల్లాలో 2,041 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 21,101 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో 101 మంది కరోనా కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 14 మంది కన్నుమూయగా, విశాఖ జిల్లాలో 11 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది మృత్యువాతపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 9,372కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 14,35,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా 12,15,683 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు.