భారతదేశంలో గత 24గంటల్లో 27,409 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 82,817 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా గత 24 గంటల్లో 347 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 4,23,127 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,17,60,458గా ఉంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 131 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 2,387 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,062 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,70,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,908 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో గత 24 గంటల్లో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటలలో 15,193 శాంపిల్స్ పరీక్షించగా, 434 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 4,636 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,13,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా 22,83,788 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,726 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,698కి పెరిగింది.
సోమవారం నాడు ఏపీలో కరోనా పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలందరూ కరోనా నియమావళి, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. దుకాణాల వద్ద, షాపింగ్ మాల్స్ లో ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.