దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. తిరుపతిలో ఒమిక్రాన్ వదంతులను నమ్మకండి..!

0
819

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 7,350 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 202 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 7,973 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 561 రోజుల క‌నిష్ఠానికి చేరుకుంది. ప్ర‌స్తుతం దేశంలో 91,456 మంది క‌రోనాకు చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,41,30,768 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 4,75,636 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 133,17,84,462 డోసులు వాడారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,625 కరోనా పరీక్షలు చేయగా.. 146 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,70,435 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,846 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,007కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 30,859 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 37 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం, కడప, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 201 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,868 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,58,490 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,912 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,466కి పెరిగింది.

ఏపీలో విజయనగరంకు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ కాగా, తిరుపతిలో బ్రిటన్ నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీహరి మాట్లాడుతూ తిరుపతిలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు వస్తున్న వదంతులను నమ్మవద్దని తెలిపారు. తిరుపతిలో నమోదైంది కరోనా పాజిటివ్ కేసు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని, ఒమిక్రాన్ అని ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు. దీనిపై ప్రజలు ఎవరూ ఆందోళనకు గురికావొద్దని అన్నారు.