భారతదేశంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకోగా, 5,24,761 మంది మరణించారు. 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా నలుగురు మరణించగా, 4,435 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో యాక్టివ్ కేసులు 0.10 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. మరణాల రేటు 1.21 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.71 శాతానికి చేరాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,07,08,541 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక, హర్యానాల్లో వెలుగు చూస్తున్న కొత్త కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేసులు పెరుగుతున్నాయని భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొత్త కేసులు కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయని.. ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌లేవీ మన దేశంలో వెలుగు చూడలేదని చెబుతున్నారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం, బూస్టర్ డోసులు తీసుకోకపోవడమే కొత్త ఇన్ఫెక్షన్లకు కారణమని చెబుతున్నారు.
కరోనా బారినపడిన చాలామందిలో సాధారణ జలుబు, తేలికపాటి అనారోగ్యం మాత్రమే కనిపిస్తోందని నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం బీఏ2 వేరియంట్‌తోపాటు బీఏ 4, బీఏ5 వేరియింట్లు మాత్రమే ఉన్నాయి. ఒమిక్రాన్, ఇతర సబ్ వేరియంట్లతో పోలిస్తే వీటి వ్యాప్తి కొంచెం ఎక్కువగానే ఉందన్నారు.