దేశంలో కరోనా కేసుల అప్డేట్స్.. కరోనా బారిన పడ్డ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

0
703

భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. కొత్త‌గా 1,68,063 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 69,959 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో క‌రోనాతో 277 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 8,21,446 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 4,461కు పెరిగింది. నిన్నటి వ‌ర‌కు మొత్తం 69,31,55,280 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని నడ్డా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కరోనా బారినపడ్డారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయిందని, వైద్యుల సలహా మేరకు ఆయన ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నారని సీఎంవో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని తెలిపింది. గతవారం నితీశ్ కుమార్ నివాసంలో 11 మందికి కరోనా సోకింది. వారిలో ఆరుగురు సీఎం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాను స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని బొమ్మై వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 70,697 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,825 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,042 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 351 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒకరు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,95,855 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,76,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14,995కి పెరిగింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,043కి పెరిగింది.