దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ ఉంది. భారతదేశంలో గత 24 గంటల్లో 19,740 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 206 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం 2,36,643 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,32,48,291కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 58.13 కోట్ల కరోనా టెస్టులు చేశారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 47,465 కరోనా పరీక్షలు నిర్వహించగా, 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 64 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 220 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,59,263 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,345 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,927కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 48,235 కరోనా పరీక్షలు నిర్వహించగా, 693 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 178 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 6 కేసుల చొప్పున గుర్తించారు. అదే సమయంలో 927 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,242కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,55,999 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,33,447 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,310 మంది చికిత్స పొందుతున్నారు.