More

    భారీగా పెరిగిన కేసులు.. మాస్క్ లు వేసుకోకపోతే దించేయండి

    భారతదేశంలో గత 24 గంటల్లో ఏకంగా 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 5,233 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 3,591 మంది కరోనా నుంచి కోలుకోగా… 8 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,498కి చేరుకుంది. భారత దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,31,97,522కి పెరిగింది. వీరిలో మొత్తం 4,26,40,301 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,723 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్ర, కేరళలోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, కర్ణాటక, హర్యానా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతానికి చేరుకుంది. రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి.

    విమాన ప్రయాణాల సందర్భంగా కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎయిర్ లైన్ సంస్థలకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పష్టం చేసింది. మాస్కులు ధరించడానికి నిరాకరించే ప్రయాణికులను విమానాల నుంచి కిందికి దించేయాలని.. విమానాశ్రయాల్లోనూ కరోనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపింది. ఎయిర్ పోర్టుల్లోనూ, విమానాల్లోనూ మాస్కులు ధరించనివారి పట్ల చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించిన నేపథ్యంలో డీజీసీఏ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ ప్రోటోకాల్ పాటించని ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా నిరోధించే అధికారం ఎయిర్ పోర్టు ఆపరేటర్లకు ఉంటుందని, కొన్ని సందర్భాల్లో కొవిడ్ నిబంధనలు అతిక్రమించే ప్రయాణికులను భద్రతా సిబ్బందికి అప్పగించవచ్చని డీజీసీఏ స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories