దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
723

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,525 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు అయ్యారు. 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,40,89,137 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,73,952 మంది మృతి చెందారు. ఇప్పటివరకు దేశంలో 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,730 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 203 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 87 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఒక మరణం సంభవించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,341కి పెరిగింది. 6,69,488 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 3,852 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 4,001కి పెరిగింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 30,747 శాంపిల్స్ పరీక్షించగా 184 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,74,036 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,57,573 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,008 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,455కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కేసు వచ్చిందనే వార్త ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. ఉమిలాడ గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.. ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాధం స్పష్టం చేశారు. ఇంకా ఒమిక్రాన్ నిర్ధారించలేదని తెలిపారు. ఆ వ్యక్తికి రెండు సార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేసామని.. రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కి పంపించామని తెలిపారు.