భారతదేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 415 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 8,190 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,974గా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,53,856గా ఉంది. మృతుల సంఖ్య మొత్తం 4,70,530కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 1,26,53,44,975 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.
విదేశాల నుంచి హైదరాబాదుకు వచ్చిన ప్రయాణికుల్లో 12 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరంతా కెనడా, యూకే, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చారు. వీరందరిని టిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. అయితే వీరందరికీ అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నాయి. వీరి రిపోర్టుల్లో ఒమిక్రాన్ నిర్ధారణ కాకపోతే హోం ఐసొలేషన్ కు పంపిస్తారు. కుత్బుల్లాపూర్ సమీపంలో ఉన్న రిడ్జ్ టవర్స్ కు చెందిన 36 ఏళ్ల మహిళ లండన్ నుంచి వచ్చింది. ఎయిర్ పోర్టులో నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ అని తేలింది. అయితే ఆ తర్వాత రిపోర్ట్స్ ను పరిశీలిస్తే పాజిటివ్ అని తేలింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 31,065 శాంపిళ్లు పరీక్షించగా 138 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్తకేసులేవీ నిర్ధారణ కాలేదు. అదే సమయంలో 118 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,390 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,56,788 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,157 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,445కి పెరిగింది.