దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. అదే సమయంలో 36,385 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో కరోనాతో మరో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,225కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,00,001 మంది కోలుకున్నారు. 4,05,681 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 67,72,11,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క కేరళలోనే 29,322 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో గత 24 గంటల్లో 71,829 కరోనా పరీక్షలు నిర్వహించగా, 318 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. ఇద్దరు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,880కి పెరిగింది. అదే సమయంలో 389 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,49,391 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు దిగువన నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,736 మంది చికిత్స పొందుతున్నారు.
03-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 64,739 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 263 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 188 కేసులు నమోదవ్వగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,887కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,18,200 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,89,391 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా 14,922 మంది చికిత్స పొందుతున్నారు.