దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అలర్ట్ అయింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల ఉందని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు ఆ ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి అధికమైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. కరోనా మహమ్మారిపై తీవ్ర పోరాటం సాగించి సాధించిన ఫలితాలను వృథా చేయరాదని, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యాప్తి మరింత ఉద్ధృతం కాకుండా కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,962 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,697 మంది కరోనా నుంచి కోలుకోగా… 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 22,416 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,72,547కి చేరుకున్నాయి. మొత్తం 4,26,25,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,24,677 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 1,93,96,47,071 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.