దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయని గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 37,379 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 124గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,71,830 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,82,017గా ఉంది. మొత్తం 1,46,70,18,464 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా బారినపడ్డారు. ఈ ఉదయం స్వయంగా ట్వీట్ చేసి వెల్లడించారు. తనకు వైరస్ సోకిందని తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండడంతో హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు అప్రమత్తంగా ఉండాలని, ఐసోలేషన్‌లో ఉండడంతోపాటు టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఢిల్లీలో కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు. డిసెంబర్ 30-31 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన శాంపిల్స్ లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 6.5 శాతం పెరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,362 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 482 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 294 కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 212 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,971 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,74,892 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,048కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 4,031కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 15,568 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 41 మందికి కరోనా నిర్ధారణ అయింది. కడప, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,61,832 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,278 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,498కి పెరిగింది.