భారతదేశంలో గత 24 గంటల్లో 44,111 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 57,477 మంది కోలుకున్నారని అధికారులు తెలిపారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,02,362కు చేరింది. గత 24 గంటల్లో 738 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,01,050కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,05,779 మంది కోలుకున్నారు. 4,95,533 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 34,46,11,291 వ్యాక్సిన్ డోసులు వేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,08,617 కరోనా పరీక్షలు నిర్వహించగా, 858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 107 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రెండేసి చొప్పున పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,175 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,678 మంది కరోనాతో కన్నుమూశారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,25,237 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,08,833 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,726 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 93,759 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,464 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 667 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 78 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,284 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 35 మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,779కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 18,96,818 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18,46,716 మంది కోలుకున్నారు. ఇంకా 37,323 మంది చికిత్స పొందుతున్నారు.
