భారతదేశంలో కొత్తగా 7,554 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 14,123 మంది కరోనా నుండి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 85,680 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు దేశంలో 177.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 19,527 కరోనా పరీక్షలు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 64 కొత్త కేసులు బయట పడ్డాయి. అదే సమయంలో 401 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,083 మంది కరోనా బారినపడగా, వారిలో 7,82,253 మంది ఆరోగ్యవంతులయ్యారు. 2,719 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 11,571 కరోనా పరీక్షలు నిర్వహించగా, 141 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 450 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,729కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,17,953 మంది కరోనా బారినపడగా, వారిలో 23,01,210 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,014 మంది చికిత్స పొందుతున్నారు.